న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ యుద్ధం వేళ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. పశ్చిమాసియాలోని అమెరికా విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఆత్యాధునిక రామ్‌జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో కూడిన కొత్త తరం సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో ఇరాన్‌కు రష్యా రహస్యంగా సహాయం చేస్తోందని పేర్కొంది.
C430L అనే కోడ్ నేమ్‌తో 2023లోనే ఈ సీక్రెట్ ప్రోగ్రామ్ ప్రారంభమైందని సంచలన విషయం బయటపెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా దశాబ్దాలుగా ఇరాన్ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్న రామ్‌జెట్ ప్రొపల్షన్ సాంకేతికతను రష్యా అందిస్తోంది. రష్యాకు చెందిన ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ ఎగుమతి సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్, క్షిపణి తయారీ సంస్థ NPO మాషినోస్ట్రోయేనియా కలిసి ఈ ప్రాజెక్టును సమన్వయం చేస్తున్నాయి.
రామ్‌జెట్ సాంకేతికత వల్ల క్షిపణులు శబ్దవేగం కంటే అత్యంత వేగంగా (సూపర్‌సోనిక్) దూసుకెళ్తాయి. సముద్రపు ఉపరితలానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దీంతో ఈ క్షిపణులను ప్రత్యర్థులు గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టతరం. ఈ మిస్సైళ్లు ఉపయోగించే మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. కాగా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ షాహెద్ డ్రోన్లను అందించింది.
►ALSO READ | నేపాల్‌లో మరో వరద ముప్పు!.. మూడు నదులు డేంజర్ లెవెల్స్ దాటాయి
ఈ సహయానికి ప్రతిఫలంగా ఇరాన్‌కు వ్యూహాత్మక రామ్‌జెట్ టెక్నాలజీని అందించి రష్యా రుణం తీర్చుకుంటుంది. ఈ రామ్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఇరాన్ ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించినట్లు సమాచారం. కానీ రష్యా సహాయంతో రూపొందించిన పూర్తి స్థాయి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇప్పటివరకు ఇరాన్ యుద్ధ రంగంలోకి దించినట్లు ఆధారాలు లేవని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రామ్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థతో పని చేసే మిస్సైళ్లు పశ్చిమాసియాలో అమెరికా నౌకాదళానికి భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
