న్యూఢిల్లీ: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం (సెప్టెంబర్ 2) డాక్టర్ వైఎస్సార్-డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
భారతీయ వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఈ అవార్డును అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బతికున్నన్ని రోజులు రైతుల కోసం పరితపించిన డాక్టర్ వైఎస్సార్‌ను మనమంతా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వైఎస్సార్ ఆశయమైన ప్రాణహిత, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.
నిరుపేదలు, రైతుల కష్టాలను తెలుసుకోవడానికి 2003లో ఎర్రటి ఎండలో ప్రజాప్రస్థానం పేరిట డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ, రైతుల ఆత్మగౌరవం పెంచడానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్సార్ అని గుర్తుచేశారు.
►ALSO READ | తిరుమల శ్రీవారి సేవలో గజరాజులు చూశారు కదా..? వాటి గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆనాడు రూ. 1300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడం, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం వంటి చర్యలతో డాక్టర్ వైఎస్సార్ రైతుల గుండెల్లో రారాజుగా నిలిచారని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ చివరి కోరిక నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ నిరుపేదలకు కనీసం ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రజా పంపిణీ (PDS) విధానాన్ని తీసుకొచ్చి పేదవారికి బియ్యం, గోధుమలు, ఇతర వస్తువులను అందించారని, ఈరోజు తెలంగాణలో 3.40 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రారంభించిన పీడీఎస్ విధానం వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి వివరించారు.
