కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాలు అంటేనే ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ, నాలుగు మాడవీధుల్లో స్వామివారి వాహనసేవలు, వీటన్నింటి మధ్య మరో ప్రత్యేక ఆకర్షణ గజరాజులు. ఠీవిగా అడుగులు వేస్తూ... తిరునామంతో అలంకరించుకుని... స్వామివారి వాహనసేవకు ముందుగా నడిచే గజరాజులు తిరుమల ఉత్సవాలకు రాజసం, గాంభీర్యాన్ని తీసుకొస్తుంటాయి. మరి, శ్రీవారి సేవలో పాల్గొనే ఆ గజరాజులు ఏవి..? వాటిని ఎలా సిద్ధం చేస్తారు..? వాటి ఆహారం, సంరక్షణ.. ఇలాంటి విషయాలు మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీవారి సేవలో పాల్గొనే గజరాజుల ఆరోగ్యం, సంక్షేమం, సంరక్షణకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం... నడక ద్వారా అవసరమైన వ్యాయామం కల్పించడం... శరీర మర్దన వంటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది.
►ASLO READ | తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్
ఉత్సవాల్లో మంగళవాయిద్యాలు, భక్తుల సందడి, విద్యుత్ దీపాల వెలుగులు ఎక్కువగా ఉంటాయి. అందుకే అలాంటి వాతావరణంలో గజరాజులు ప్రశాంతంగా ఉండేలా ముందుగానే అలవాటు చేస్తారు. వాహనసేవల్లో పాల్గొనే సమయంలోనూ వాటి ఆరోగ్యం, ప్రవర్తన, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటారు.
గజరాజుల ఆరోగ్య సంరక్షణలో ఆహారం కూడా అత్యంత కీలకం... వాటికి అవసరమైన పచ్చిగడ్డి, నేపియర్ గడ్డి, చెరకు వంటి ఆహారాన్ని అందిస్తారు. అలాగే అవసరమైన నీటిని సమయానికి అందేలా ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ సమయం ఉత్సవాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు వాటి శారీరక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆహారం, విశ్రాంతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
