India vs South Africa ODI Series: 2027లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు పక్కా ప్రణాళికను సిద్ధం చేసేందుకు భారీ వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా మెగా టోర్నీకి కొన్ని నెలల ముందే దక్షిణ ఆఫ్రికా గడ్డపై ఆతిథ్య జట్టుతో 4 నుంచి 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు బీసీసీఐ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఇప్పటికే క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) సెకండ్ హాఫ్ లో ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ జరిగే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
బౌన్స్ పిచ్‌లపై అవగాహన.. టీమ్ మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్:
రాబోయే వన్డే ప్రపంచకప్‌కు దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. సౌతాఫ్రికాలోని బౌన్స్ పిచ్‌లపై ఇండియన్ ఆటగాళ్లకు అనుభవం అత్యంత కీలకమని భావించిన భారత టీమ్ మేనేజ్‌మెంట్, టోర్నీకి ముందే అక్కడ ఒక సుదీర్ఘ వన్డే సిరీస్ ఏర్పాటు చేయాలని బీసీసీఐని కోరింది. గతంలో డిసెంబర్ 2023లో కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు అక్కడ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1 తేడాతో గెలుచుకుంది. అయితే ఈసారి ప్రధాన జట్టుతోనే బరిలోకి దిగి అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అలవాటు పడాలని ప్లాన్ చేస్తున్నారు.
24 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికాలో మెగా టోర్నీ:
దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగడం సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారి కానుంది. గతంలో చివరిగా 2003లో ఆ దేశం పూర్తిస్థాయిలో వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వగా, దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ 50 ఓవర్ల ప్రపంచకప్ నిర్వహించనుండటంతో టోర్నమెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 అక్టోబర్– నవంబర్ నెలల్లో జరిగే ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు దక్షిణ ఆఫ్రికాలోని 8 వేదికలు, జింబాబ్వేలోని 3, నమీబియాలోని 1 స్టేడియం వేదిక కానున్నాయి.
భారత్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా:
దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టుకు ప్రపంచకప్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో 2003లో అక్కడ జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన టీమిండియా, తుది సమరం వరకు వెళ్లి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 2027లో కూడా అదే సఫారీ గడ్డపై టోర్నీ జరుగుతుండటంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది. టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో ఆడే ఈ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఇండియన్ ప్లేయర్స్ కు ప్రాక్టీస్‌గా మాత్రమే కాకుండా, జట్టు బలాబలాలను అంచనా వేసుకోవడానికి గోల్డెన్ ఆపర్చునిటీగా మారనుంది.
The BCCI in talks with Cricket South Africa to squeeze in an ODI series, to prepare for the 2027 World Cup.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2026
The ODI series could comprise 4-6 matches leading up to the World Cup. (Express Sports). pic.twitter.com/UCXgGHvcZ8
