- నానక్‌రామ్‌గూడ సహా ఆరు ప్రాంతాల్లో సోదాలు
- స్థిరచరాస్తులు, బినామీ ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: మాదకద్రవ్యాల సరఫరాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. డ్రగ్స్, గంజాయి ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ము, హవాలా లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో గంజాయి డాన్‌గా పేరుగాంచిన నీతూబాయిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ అధికారులు, ఈగల్ ఫోర్స్ నమోదు చేసిన కేసుల ఆధారంగా గురువారం నానక్‌రామ్‌గూడ లోథాబస్తీలోని ఆమె నివాసంతో పాటు దూల్‌పేటలోని కుటుంబ సభ్యుల ఇండ్లు సహా మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
గంజాయి అమ్మకాల ద్వారా కూడబెట్టిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్న అధికారులు.. ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో కొనుగోలు చేసిన స్థిరచరాస్తులను ఈడీ సీజ్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న నీతూబాయి.. సోదాల సమయంలోనూ అందుబాటులో లేకుండా పరారీలో ఉంది. వరుస కేసులు, పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లిన నీతూబాయి సంపాదనపై ప్రస్తుతం ఈడీ కూపీ లాగుతోంది.
