‘పయనీర్‌‌‌‌ పేపర్’ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలొద్దు..టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

‘పయనీర్‌‌‌‌ పేపర్’ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలొద్దు..టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
  •     ఆమెతో పాటు మరో14 మందికి నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: ‘ద పయనీర్’ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కామెంట్లు, ఆరోపణలు చేయొద్దని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆమెతోపాటు మరో 14 మందికి నోటీసులు ఇచ్చింది. పయనీర్ పత్రికను బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత తీసుకున్నారని, అందువల్ల ఆ పత్రిక వార్తలను నమ్మొద్దని కవిత ఆరోపించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆ పత్రికను ప్రచురించే సీఎంవైకే ప్రింటెక్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. 

ఆ పిటిషన్ పై గురువారం జస్టిస్ సచిన్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. కవిత చేసిన ఆరోపణలు పూర్తిగా  నిరాధారం, అవాస్తవమైనవని కోర్టుకు నివేదించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల పత్రిక ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పయనీర్ పత్రిక పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని కవితతోపాటు మరో 14 మంది ప్రతివాదులకు స్పష్టం చేసింది. కంటెంట్‌‌‌‌ను ఏ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లోనూ ప్రచురించరాదని, బ్రాడ్‌‌‌‌కాస్ట్ చేయరాదని ఆదేశాల్లో పేర్కొంది. కవితతో పాటు ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై తమ వాదనలను రాతపూర్వకంగా దాఖలు చేయాలని స్పష్టం చేసింది.