మోదీ-పెజెష్కియన్ భేటీపై అమెరికా సీరియస్..ఇరాన్ కు సాయం చేస్తే ఆంక్షలు తప్పవని వార్నింగ్

మోదీ-పెజెష్కియన్ భేటీపై అమెరికా సీరియస్..ఇరాన్ కు సాయం చేస్తే ఆంక్షలు తప్పవని వార్నింగ్

వాషింగ్టన్: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌‌‌‌‌‌‌‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌‌‌‌‌‌‌‌సీవో) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరిగింది. అయితే, ఈ భేటీపై అమెరికా తీవ్రంగా స్పందించింది. 

అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పట్టించుకోకుండా ఇరాన్‌‌‌‌‌‌‌‌కు సహాయం చేస్తే.. ఆ దేశాలపై కూడా కఠిన అంక్షలు విధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టెహ్రాన్‌‌‌‌‌‌‌‌ ఆర్థికంగా బలపడేందుకు సాయపడే దేశాలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

టెర్రరిజాన్ని పోషించడానికి, అణు ఆయుధాలను తయారు చేయడానికి ఇరాన్ అనుసరిస్తున్న ఆదాయ మార్గాలకు ఏ దేశమూ మద్దతు ఇవ్వకూడదు. భారత్, ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం జరిగిందని నేను అనుకోను. ప్రతి దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇరాన్‌‌‌‌‌‌‌‌తో సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ, ఇరాన్‌‌‌‌‌‌‌‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించాలని ప్రయత్నిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు’ అని రూబియో తేల్చిచెప్పారు.  

ఎస్‌‌‌‌‌‌‌‌సీవో సదస్సుకు బయలుదేరే ముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ మాట్లాడుతూ.. తమ దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, కానీ ఎవరైనా దాడికి తెగబడితే మాత్రం గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, భారత్ ఎప్పుడూ కూడా శాంతి, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో నివసించే భారతీయ ప్రవాసుల భద్రత, ఇంధన వస్తువుల నిరంతర రవాణా భారత్‌‌‌‌‌‌‌‌కు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మోదీ, పెజెష్కియాన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ.. రూబియో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.