టిబెట్‌‌‌‌లో మరిన్ని  గ్లేసియర్ల ముప్పు..పీఠభూమిలో అస్థిరంగా హిమానీనదాలు

టిబెట్‌‌‌‌లో మరిన్ని  గ్లేసియర్ల ముప్పు..పీఠభూమిలో అస్థిరంగా హిమానీనదాలు
  • పీఠభూమిలో అస్థిరంగా హిమానీనదాలు
  • 60 ఏండ్లలో గ్లేసియర్ల విస్తీర్ణం 24% తగ్గింది
  • భవిష్యత్తులో మరిన్ని విపత్తులు సంభవించొచ్చు: చైనా క్లైమెట్​ సెంటర్​
  • నేపాల్‌‌‌‌లో 1,252కు పెరిగిన మృతుల సంఖ్య

బీజింగ్/ఖాట్మాండు: టిబెట్ పీఠభూమిలోని హిమానీనదాలు (గ్లేసియర్స్) మరింత అస్థిరంగా మారుతున్నాయని, ఇది గత వారం టిబెట్-–నేపాల్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదల మాదిరిగానే మరిన్ని విపత్తులకు దారితీసే అవకాశం ఉందని చైనా నేషనల్ క్లైమేట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గావో రోంగ్ హెచ్చరించారు. ‘‘గత 60 ఏళ్లలో టిబెట్ పీఠభూమిలోని గ్లేసియర్ ప్రాంతం దాదాపు 24 శాతం కుచించుకుపోయింది. అంతేకాకుండా దాదాపు 7,000 చిన్న గ్లేసియర్లు పూర్తిగా కనుమరుగయ్యాయి”అని ఆయన తెలిపారు. ‘‘భవిష్యత్తులో టిబెట్ పీఠభూమి వ్యాప్తంగా గ్లేసియర్ల నిర్మాణపరమైన స్థిరత్వం మరింత క్షీణిస్తుంది. గ్లేసియర్ సంబంధిత విపత్తులు మరింత తరచుగా సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇవి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ (ఒక దాని తర్వాత ఒకటి వచ్చే ప్రభావాల) ద్వారా మరింత విధ్వంసాన్ని సృష్టించగలవు’’ అని గావో హెచ్చరించారు. చైనా ప్రభుత్వానికి చెందిన మరో అధికారిక సంస్థ అయిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ప్లేటూ రీసెర్చ్ తాజా విపత్తుపై తన నివేదికలో ఒక కీలక అంశాన్ని వెల్లడించింది. గ్లేసియర్ కూలిపోవడం వల్ల ఏర్పడిన బురద ప్రవాహం (మడ్‌‌‌‌‌‌‌‌స్లైడ్) లోయ వెంట 22 కిలోమీటర్లు ప్రయాణించి, కేవలం ఏడు నిమిషాల్లోనే టిబెట్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న గ్యిరాంగ్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ను చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. 

అది ‘హిమాలయన్ సునామీ’: ఖనాల్ 

దేశంలో విస్తృత ప్రాణనష్టానికి, విధ్వంసానికి కారణమైన భారీ వరదలను నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ 'హిమాలయన్ సునామీ'గా అభివర్ణించారు. ఇంతటి తీవ్రమైన వరదలను గతంలో ఎన్నడూ తాను చూడలేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు మద్దతు, సంఘీభావం తెలిపిన పొరుగు దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ఆయన గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఖనాల్ బుధవారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైనా, అమెరికా, భారతదేశాలను ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తున్న అతిపెద్ద దేశాలుగా పేర్కొన్నారు. నేపాల్ లాంటి బలహీనమైన దేశాలకు నష్టపరిహారం చెల్లించాల్సిన చారిత్రక బాధ్యత ఆ దేశాలపై ఉందన్నారు. కార్బన్ ఉద్గారాలకు కారణమవుతున్న పారిశ్రామిక దేశాలు, కార్బన్ ఉద్గారాలలో అతి తక్కువ పాత్ర ఉన్న నేపాల్ లాంటి దేశానికి నష్టపరిహారం చెల్లించాలని ఖనాల్ స్పష్టం చేశారు. మరునాడే భారత్ సహా ఆయా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

1,252కు పెరిగిన డెత్స్ 

నేపాల్‌‌‌‌‌‌‌‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో మరికొన్ని మృతదేహాలను వెలికితీశారు. దీంతో నేపాల్‌‌‌‌‌‌‌‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1,252కు చేరింది. నేపాల్ ఆర్మీ ఆధ్వర్యంలోని సంయుక్త రెస్క్యూ టీమ్‌‌‌‌‌‌‌‌లు తొమ్మిదవ రోజు కూడా సహాయక చర్యలను కొనసాగించాయి. ఈ ప్రమాదంలో ఇంకా 4,875 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. మరోవైపు, చైనా వైపు ఉన్న నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌‌‌‌‌‌‌‌లో గ్యిరాంగ్ కౌంటీని తాకిన ఈ వరదలో మృతుల సంఖ్య 21కి చేరింది. బుధవారం నాటికి 541 మంది ఇంకా గల్లంతైనట్లు వెల్లడించారు. అలాగే, భోటేకోషి నది ఎగువ ప్రాంతాలలో నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో మళ్లీ వరదలు ముంచెత్తే ప్రమాదం ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.  

టిబెట్‌‌‌‌‌‌‌‌లో 5.1 తీవ్రతతో భూకంపం

టిబెట్‌‌‌‌‌‌‌‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం ధాటికి నేపాల్ సరిహద్దు ప్రాంతంలోనూ ప్రకంపనలు వచ్చాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది. టిబెట్, నేపాల్ సరిహద్దులో హిమానీనదం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తి వెయ్యికిపైగా మంది మృతిచెందిన ఘటన జరిగిన వారం రోజులకే మళ్లీ భూకంపం సంభవించడం ఆందోళనకరంగా మారింది. అయితే, తాజా భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు.