చైనాలో ఒక యువకుడు చేసిన వినూత్న ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా మన శరీరంలో ఎక్కడైనా దురద వస్తే మనమే గోక్కుంటాం లేదా ఇంట్లోని వాళ్ల సాయం తీసుకుంటాం. కానీ చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ గ్యావోకియావో దానినే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మలచుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా 'దురద తీర్చే' ప్రత్యేక సర్వీస్‌ను ప్రారంభించి నెలకు సుమారు రూ.14 లక్షల వరకు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
షెన్‌జెన్ నగరంలో 'సుమా' పేరుతో జాంగ్ తన మొదటి అవుట్‌లెట్‌ను ఈ ఏడాది మే ప్రారంభంలో ఏర్పాటు చేశాడు. దీనికి వచ్చిన స్పందన చూసి జూన్ నాటికి ఫుటియన్ జిల్లాలో మరో బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. ఈ వింత వ్యాపారంలో గంట పాటు సాగే ఒక్కో సెషన్‌కు వినియోగదారులు దాదాపు రూ.4వేల 200 చెల్లిస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫేక్ గోళ్లను ధరించిన సిబ్బంది, కస్టమర్ల శరీర భాగాలపై సున్నితంగా గోకుతూ సేవలందిస్తారు. రద్దీగా ఉండే నగరాల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి.. ప్రశాంతమైన నిద్రను అందించడమే ఈ సర్వీస్ ప్రధాన ఉద్దేశం.
ఈ వినూత్న వ్యాపార ఆలోచన జాంగ్‌కు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. గత ఏడాది ఒక మహిళ తన భర్త వీపు గోకుతున్న షార్ట్ వీడియోను చూసిన అతడు.. దాని కింద కామెంట్స్ గమనించాడు. అలా ఎవరైనా తమ వీపు గోకితే డబ్బులు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కొందరు యూజర్లు పెట్టిన కామెంట్స్ జాంగ్‌ను ఆలోచింపజేసింది. చిన్నతనంలో తన తండ్రి తన వీపు గోకినప్పుడు కలిగే హాయి, నిద్ర వచ్చే అనుభూతిని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు. దీనిపై లోతుగా పరిశోధన చేసి, శాస్త్రీయమైన పద్ధతులను అభివృద్ధి చేసి ఈ బిజినెస్‌ను విజయవంతంగా ప్రారంభించారు.
మొదట్లో ఈ వ్యాపారంపై ఎన్నో సందేహాలు వ్యక్తమైనప్పటికీ.. ఇప్పుడు ఇది లాభాల బాట పట్టింది. ఈ స్టోర్‌కు వచ్చే కస్టమర్లలో 70 శాతం మంది పురుషులే ఉండటం విశేషం. మసాజ్ కంటే ఈ గోకించుకునే సర్వీసే ఎంతో రిలాక్సింగ్‌గా ఉందని కస్టమర్లు చెబుతుండటంతో రిపీట్ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. దీనితో ప్రస్తుతం ఉన్న రెండు అవుట్‌లెట్లు ఇప్పటికే బ్రేక్-ఈవెన్ సాధించి లాభాలను ఆర్జిస్తున్నాయి.
ALSO READ : E20 పెట్రోల్ తయారీతో 40% పెరిగిన గుడ్ల రేట్లు..
భవిష్యత్తులో ఈ వినూత్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలని జాంగ్ గ్యావోకియావో ప్రణాళికలు రచిస్తున్నారు. చైనా వ్యాప్తంగా సుమారు 100 స్టోర్‌లను ప్రారంభించడమే తన లక్ష్యమని చెప్పాడు. కేవలం వ్యాపారాన్ని పెంచడమే కాకుండా.. ఈ దురద తీర్చే సేవను ఒక అధికారిక వృత్తిగా మార్చాలని భావిస్తున్నాడు. సరైన శిక్షణ, ప్రామాణిక పద్ధతులతో ఈ సేవలను మరింత మందికి చేరువ చేసి, దీనికి ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు ఈ చైనా కుర్రోడు. దీనిని చూసిన వారు ప్రజలకు ఏం కావాలో, వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవటమే నేటి కాలంలో వ్యాపారాలకు పునాదులని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
