దివ్య మిట్టల్ ఎవరు ? 13 ఏళ్ల తర్వాత ఐఏఎస్ పదవికి రాజీనామా.. కారణం ఏంటంటే ?

దివ్య మిట్టల్ ఎవరు ? 13 ఏళ్ల తర్వాత ఐఏఎస్ పదవికి రాజీనామా.. కారణం ఏంటంటే ?

ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులలో చదివి, లండన్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఐఏఎస్ అయిన దివ్య మిట్టల్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తర ప్రదేశ్ (యుపి) కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె, 13 ఏళ్ల ప్రజా సేవ తర్వాత ఆగస్టు 30న సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయాణాన్ని 'మరచిపోలేనిది'గా అభివర్ణించిన ఆమె కథనం సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

 ఎవరు ఈ దివ్య మిట్టల్ ?
దివ్య మిట్టల్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె సంత్ కబీర్ నగర్, మీర్జాపూర్, డియోరియా జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్ (డిఎమ్)గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీనామా చేసే సమయానికి ఆమె యుపి రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఆమె సోషల్ మీడియాలో కూడా విశేష ఆదరణ పొందారు.

ఐఐటి ఢిల్లీ నుండి లండన్ ఫైనాన్స్ వరకు...
ఐఏఎస్ కావడానికి ముందు దివ్య ప్రయాణం చాలా అసాధారణమైనది.  ఆమె చదువు ఐఐటి ఢిల్లీ నుండి ఇంజనీరింగ్, ఐఐఎం బెంగళూరు నుండి ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ తర్వాత లండన్‌లోని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'జేపీమోర్గాన్'లో లక్షల జీతంతో మంచి ఉద్యోగం చేశారు. విదేశాల్లో ఎంత మంచి కెరీర్ ఉన్నా, తన సొంత దేశానికి ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఇండియాకు తిరిగి వచ్చి యుపిఎస్సి (UPSC)కి ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. అయినా సంతృప్తి చెందక మళ్లీ పరీక్ష రాసి ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు.

►ALSO READ | రిజర్వేషన్ విషయంలో తండ్రి కులమేనా.. తల్లి కులం చూడరా..? హైకోర్టు కీలక ఆదేశాలు

మీర్జాపూర్ నీటి ప్రాజెక్ట్: కెరీర్‌లో పెద్ద మైలురాయి
మీర్జాపూర్ డిఎమ్‌గా ఉన్నప్పుడు ఆమె చేసిన సేవలు ప్రజల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దశాబ్దాలుగా తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న లహూరియా దాహ్ అనే మారుమూల గ్రామానికి అన్ని సవాళ్లను అధిగమించి పైపుల ద్వారా తాగునీరు అందించారు. సుమారు 125 పేద కుటుంబాల దాహం తీర్చిన ఈ ప్రాజెక్ట్, ఆమె అధికారిక ముద్రకు నిదర్శనంగా నిలిచింది.

13 ఏళ్ల తర్వాత  రాజీనామా 
దివ్య మిట్టల్ రాజీనామా చేయడం పూర్తిగా ఆమె సొంత నిర్ణయం. దీని వెనుక ఎలాంటి రాజకీయ వివాదాలు గానీ, క్రమశిక్షణా చర్యలు గానీ లేవు. ఐఐటి, ఐఐఎం, లండన్ ఉద్యోగం సాధించినా లభించని తృప్తి సివిల్ సర్వీసెస్‌లో దొరికిందని, 13 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేసినందుకు ఎంతో గర్వపడుతున్నానని ఆమె తెలిపారు.

డియోరియా జిల్లా తనకు "న్యాయం వైపు నిలబడటం" నేర్పిస్తే, మీర్జాపూర్ జిల్లా "అసాధ్యం అనేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే" అని నేర్పించిందని గుర్తుచేసుకున్నారు. ప్రజా సేవలో గడిపిన ప్రతి క్షణం విలువైనదని, తన జీవితంలోని తదుపరి అధ్యాయం కోసం ఐఏఎస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

పదవికి రాజీనామా చేసినప్పటికీ, తన లక్ష్యాలు, కలలు ఇక్కడితో ముగిసిపోవని ఆమె తెలిపారు. తరువాత ఆమె ఏ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారనేది ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, లండన్ ఫైనాన్స్ నుంచి ఐఏఎస్ వరకు, ఇప్పుడు రాజీనామా వరకు ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.