రిజర్వేషన్ విషయంలో తండ్రి కులమేనా.. తల్లి కులం చూడరా..? హైకోర్టు కీలక ఆదేశాలు

రిజర్వేషన్ విషయంలో తండ్రి కులమేనా.. తల్లి కులం చూడరా..? హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దంపతుల సంతానం కులం, రిజర్వేషన్ వర్తింపు ఎలా ఉంటుందో అవగాహన ఉండే ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో తండ్రి కులం ఆధారంగా పిల్లలకు కుల ధృవీకరణ, రిజర్వేషన్ వర్తింపు ఉంటుంది. అయితే ఈ విధానంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తండ్రే కాదు.. తల్లి కులం ఆధారంగా కూడా రిజర్వేషన్ అమలు, కుల ధృవీకరణ ఉండాల్సిందేనని పేర్కొంది. 

కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) జారీ చేసేటప్పుడు కేవలం తండ్రి పుట్టుక, నివాస స్థలం ఆధారంగానే పిల్లలకు స్థానికత నిర్ణయించాలన్న పుదుచ్చేరి ప్రభుత్వ విధానాన్ని మద్రాస్ హైకోర్ట్ తప్పుపట్టింది.  బిడ్డ ఎదుర్కొనే సామాజిక వెనుకబాటుతనం, వివక్ష ఆధారంగా రిజర్వేషన్‌ కల్పిస్తారని, అది తండ్రి వైపు నుంచా లేక తల్లి వైపు నుంచా అనేది ప్రయోజనాలను కల్పించడంలో ఎలాంటి వ్యత్యాసం చూపదని స్పష్టం చేసింది. దంపతులలో ఏ ఒక్కరు నిమ్న వర్గాల వారైనా పిల్లలపై వివక్ష సమానంగా ఉంటుందని పేర్కొంది.

 ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చారనే కారణంతో పుదుచ్చేరి అధికారులు తమకు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడంలేదని.. లేదంటే మైగ్రెంట్‌ కేటగిరీ కింద జారీ చేస్తున్నారని పేర్కొంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు బెంచ్..  ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

  ఈ కేసులన్నింటిలోనూ తల్లులు పుదుచ్చేరి కి చెందిన స్థానికులే కావడం గమనార్హం. వారంతా ఎస్సీ, ఎంబీసీ, ఓబీసీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నవారే. అయితే, మనది పితృస్వామ్య సమాజం కాబట్టి కులాన్ని తండ్రి వైపు నుంచే గుర్తించాలని, చట్టపరమైన నిబంధన లేకుండా తల్లి వైపు నుంచి గుర్తించలేమన్న పుదుచ్చేరి ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ల తల్లి స్థానికురాలైనప్పుడు ఆ  వివరాల ఆధారంగా క్యాస్ట్ సర్టిఫికెటట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.