అమెరికాకు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ పేపాల్ భారత్‌లో ఊహించని షాక్ ఇచ్చింది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తన ఉద్యోగులను లేఆఫ్ చేస్తోంది. భారత్‌లోని మొత్తం ఉద్యోగుల్లో 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాకాలను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ వంటి కీలక విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది.
భారత్‌లో పేపాల్‌కు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ప్రధాన టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. తాజా కోతలతో ఈ 3 నగరాల్లోని ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 2008లో చెన్నైలో ఏర్పాటైన కేంద్రం కోర్ పేమెంట్ సిస్టమ్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పనిచేస్తుండగా.. బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ AI, మెషిన్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టింది. ఇక హైదరాబాద్ ఆఫీస్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఫ్రాడ్ ప్రివెన్షన్ విభాగాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 6వేల మందికి పైగా ఉన్న ఈ భారతీయ వర్క్‌ఫోర్స్‌లో లేఆఫ్స్ కలకలం రేపాయి.
దీర్ఘకాలిక వృద్ధిని సాధించేందుకు, గ్లోబల్ ఆపరేషన్స్‌ను సులభతరం చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేపాల్ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తమకు తెలుసని, ఈ ట్రాన్సిషన్ కాలంలో వారికి తగిన సపోర్ట్ అందిస్తామని స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతను వేగంగా అందుకోవడం, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడమే ఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే.. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో రాబోయే ఏళ్లలో సుమారు 20 శాతం.. అంటే దాదాపు 4వేల760 మంది ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ ప్లాన్ చేసిందట.
కేవలం భారత్ మాత్రమే కాకుండా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంతో పాటు అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లోనూ ఈ కోతలు దశలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐర్లాండ్‌లో దాదాపు 164 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోరు పెరుగుతుండటంతో ఆపిల్, ఒరాకిల్, ఉబర్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం టెక్ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తోంది.
