ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ హక్కులు పోయాయి.. శ్రీలంకకు ఏకంగా  రూ.170 కోట్ల నష్టం!

ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ హక్కులు పోయాయి.. శ్రీలంకకు ఏకంగా  రూ.170 కోట్ల నష్టం!

Women’s Champions Trophy: 2027లో తొలిసారిగా జరగనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను భారతదేశం దక్కించుకుంది. శ్రీలంక నుంచి ఆతిథ్య హక్కులను రద్దు చేసిన ఐసీసీ, బోర్డు మీటింగ్ లో భారత్‌ను అధికారిక వేదికగా ఖరారు చేసింది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా నుంచి పోటీ ఉన్నప్పటికీ ఐసీసీ భారత్‌ వైపే ఇంట్రెస్ట్ చూపించింది. 2027 ఫిబ్రవరి 14 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లకు ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మైదానంతో పాటు వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

లంకను ముంచేసిన రాజకీయ జోక్యం.. రూ. 170 కోట్ల ఆదాయానికి గండి: 

శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) నిర్వహణలో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, నిర్ణీత గడువులోగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకపోవడమే ఆతిథ్య హక్కులు కోల్పోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. జూలై 2026 నాటికే ఎన్నికలు జరపకపోతే టోర్నీ చేజారుతుందని ఐసీసీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ లంక అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్ణయంతో శ్రీలంక బోర్డు సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 165 కోట్లు) భారీ ఆదాయాన్ని నష్టపోనుంది. గతంలో 2023లో కూడా ఇదే కారణంతో 2024 అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను లంక కోల్పోయి దక్షిణాఫ్రికాకు అప్పగించాల్సి వచ్చింది.

మొత్తం 6 జట్లు.. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో హోరాహోరీ: 

తొలి ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో పాటు ఆతిథ్యం కోల్పోయిన శ్రీలంక కూడా పోటీ పడనుంది. టోర్నమెంట్‌ను రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. లీగ్ దశలో ప్రతీ జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే టాప్-2 జట్లు ఫిబ్రవరి 28వ తేదీన జరిగే గ్రాండ్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడనున్నాయి.

బీసీసీఐ ఖాతాలో మరో మెగా ఈవెంట్.. జై షా హర్షం: 

మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక మైలురాయిగా నిలుస్తుందని, భారత్‌లో దీనిని నిర్వహించడం సంతోషకరమని ఐసీసీ ఛైర్మన్ జై షా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఐసీసీ మెగా టోర్నీలను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న బీసీసీఐ, ఇప్పుడు ఈ టోర్నీ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆతిథ్యం పోయినా బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుతో పాటు ప్రపంచ అత్యుత్తమ జట్లు ముంబై, వడోదరా పిచ్‌లపై కప్పు కోసం తలపడనుండటంతో అభిమానులకు క్రికెట్ విందు ఖాయంగా కనిపిస్తోంది.