నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటం లేదు.. CSK జట్టులో తన రోల్‌పై ఎంఎస్ ధోనీ క్లారిటీ!

నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటం లేదు.. CSK జట్టులో తన రోల్‌పై ఎంఎస్ ధోనీ క్లారిటీ!

MS Dhoni IPL Future: చెన్నై సూపర్‌కింగ్స్ (CSK) దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి తన రోల్‌పై కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్కే మాజీ ఆటగాడు ఎస్. బద్రీనాథ్ వెల్లడించాడు. రాబోయే సీజన్‌లో ధోనీపై వర్క్‌లోడ్ తగ్గించేందుకు అతనిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నప్పటికీ, తాను మాత్రం పూర్తిస్థాయి వికెట్ కీపర్‌గానే బరిలోకి దిగుతానని ధోనీ తేల్చిచెప్పాడట. తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనని, 20 ఓవర్ల పాటు మైదానంలో ఉంటూ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తానని ధోనీ నాతో వ్యక్తిగతంగా చెప్పాడని బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పష్టం చేశాడు.

వ్యూహాత్మకంగా మేలైనా.. ధోనీ పట్టుదల అదే: 

వయసు రీత్యా శరీరంలో ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతున్నందున ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగిస్తే సీఎస్కేకు వ్యూహాత్మకంగా ఎంతో మేలు జరుగుతుందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ శరీరం సుదీర్ఘ సమయం తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేకపోతోందని, అతను కేవలం 16వ ఓవర్ తర్వాతే బ్యాటింగ్‌కు వస్తున్నందున కీపింగ్‌కు బదులు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటమే ఉత్తమమని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా భావించినట్లు గుర్తు చేశాడు. అయినప్పటికీ, మైదానంలో ఫుల్ టైమ్ ప్లేయర్‌గా ఉండటానికే ధోనీ ప్రాధాన్యత ఇస్తున్నాడని వివరించాడు.

శివమ్ దూబే బౌలింగ్ వివాదం.. మేనేజ్‌మెంట్‌దే తప్పు: 

మరోవైపు, సీఎస్కే టీమ్‌లో శివమ్ దూబే బౌలింగ్ చేయకపోవడంపై వస్తున్న కథనాలను బద్రీనాథ్ ఖండించాడు. టీమిండియా తరఫున రెగ్యులర్‌గా బౌలింగ్ చేసే దూబేను సీఎస్కే తరఫున ఆడించేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అడ్డువస్తోందనడం సరికాదన్నాడు. దూబే చేత బౌలింగ్ వేయించకపోవడం అనేది పూర్తిగా సీఎస్కే మేనేజ్‌మెంట్ వ్యూహాత్మక లోపమే తప్ప ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్పు కాదన్నాడు. అతనిని కేవలం బ్యాటర్‌గానే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు ఉపయోగిస్తున్నారు? అని బద్రీనాథ్ ప్రశ్నించాడు.

►ALSO READ | ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ హక్కులు పోయాయి.. శ్రీలంకకు ఏకంగా  రూ.170 కోట్ల నష్టం!

అకీల్ హొస్సేన్ ప్లేయింగ్ ఎలెవన్ లో తీసుకోండి:  

వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్‌ను ప్లేయింగ్ ఎలెవెం‌లో నేరుగా ఎంపిక చేయకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా రిజర్వ్‌లో ఉంచడంపై కూడా బద్రీనాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అకీల్ హొస్సేన్ కచ్చితంగా ప్రధాన జట్టులోనే ఉండాలని, కానీ సీఎస్కే మొదట సరిగ్గా బ్యాటింగ్ చేయకపోగానే అదనపు బ్యాటర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చి హొస్సేన్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తోందని మండిపడ్డాడు. ఇది తెలివితక్కువ నిర్ణయం.. మీ సొంత నిర్ణయాల లోపానికి ఐపీఎల్ నిబంధనలను నిందించడం సరికాదంటూ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.