ఏషియన్ గేమ్స్ 2026పై BCCI ఫోకస్.. భారత జట్టు కోచ్‌గా VVS లక్ష్మణ్?

ఏషియన్ గేమ్స్ 2026పై BCCI ఫోకస్.. భారత జట్టు కోచ్‌గా VVS లక్ష్మణ్?

VVS Laxman: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్‌కు సహాయకులుగా సునీల్ జోషి, హృషీకేష్ కనిట్కర్, సుభదీప్ ఘోష్‌లను క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ బాధ్యతల్లో బిజీగా ఉండనుండటంతో లక్ష్మణ్‌ను ఈ మెగా ఈవెంట్‌కు కోచ్‌గా పంపాలని బోర్డు నిర్ణయించింది. గతంలో 2023 చైనా ఏషియన్ గేమ్స్‌లో కూడా లక్ష్మణ్ డైరెక్షన్స్ లోనే టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో విద్వంసకర జట్టు: 

ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను కాపాడుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి పవర్‌ఫుల్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ క్రికెట్ పోటీల్లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టనుంది. గ్రూప్-ఎ (అఫ్గానిస్థాన్, నేపాల్, జపాన్)లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో సెప్టెంబర్ 28న భారత్ తన తొలి పోరులో తలపడనుంది.

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళల సేన సన్నాహాలు: 

మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టుకు అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా కొనసాగనుండగా, ఆవిష్కార్ సాల్వి (బౌలింగ్), మునీష్ బాలి (ఫీల్డింగ్) ఆయనకు సహాయక సిబ్బందిగా వ్యవహరిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇండియన్ ఉమెన్స్ జట్టుకు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా.. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మహిళల విభాగంలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ జట్టుతో తలపడనుంది.

►ALSO READ | నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటం లేదు.. CSK జట్టులో తన రోల్‌పై ఎంఎస్ ధోనీ క్లారిటీ!

రెండోసారి డబుల్ గోల్డ్ వేటలో భారత్: 

2023 హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ రెండింటిలోనూ చారిత్రాత్మక స్వర్ణ పతకాలను గెలుచుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈసారి కూడా అదే జోరును రిపీట్ చేస్తూ ఆసియా ఖండంలో తన క్రికెట్ ఆధిపత్యం తిరుగులేనిదని నిరూపించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఒకవైపు వెస్టిండీస్‌తో సీనియర్ జట్టు వన్డే సిరీస్ ఆడుతున్నప్పటికీ, అత్యంత పటిష్టమైన జట్లను రంగంలోకి దించడంతో ఏషియన్ గేమ్స్‌లో భారత్ మరోసారి డబుల్ గోల్డ్ సాధించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా క్రీడలు 2026లో భారత క్రికెట్ జట్లు:

భారత మెన్స్ క్రికెట్ జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాయిబ్ సోయవనీబ్.

భారత ఉమెన్స్ క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), గుణాలన్ కమలిని, భారతీ ఫుల్‌మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, నందాని శర్మ పాటిల్.