ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మీడియాతో కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మీడియాతో కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న మంత్రి కొండా సురేఖ ఎయిర్ పోర్ట్లో మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు.

ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశానని ఆమె చెప్పారు. తనకు జరుగుతున్న పరిణామాలను వారికి వివరించానని అన్నారు. తాను చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు.

మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఖర్గేకు ఆమె వివరణ ఇచ్చారు. సుస్మితా పటేల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం రేపాయి. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడటం సరికాదని, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని ఖర్గే ఇప్పటికే కొండా సురేఖకు సూచించారని తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన విషయాలను పార్టీ వేదిక పైనే చెప్పుకోవాలని ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం.

మంత్రి కూతురు మాట్లాడితే మంత్రికి శిక్ష వేయాలా? వద్దా? అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు రెండుసార్లు జరిగితే వివరంగా క్రమశిక్షణా కమిటీ నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు పంపించామని ఆయన చెప్పారు. కొండా సురేఖ హై ప్రొఫైల్ ఉన్న సీనియర్ నాయకురాలని.. వారిపై చర్యలు ఉంటాయా? ఉండవా? అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.