టాలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. అధ్యక్ష రేసు నుంచి బండ్ల గణేష్ సడన్ ఎగ్జిట్?

టాలీవుడ్ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. అధ్యక్ష రేసు నుంచి బండ్ల గణేష్ సడన్ ఎగ్జిట్?

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల వేడి టాలీవుడ్‌లో పీక్స్‌కు చేరింది. సెప్టెంబర్ 6న జరగనున్న ఈ హై-వోల్టేజ్ పోరులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రెసిడెంట్ బరిలో గట్టి పోటీ ఇస్తారనుకున్న ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నాటరంటూ టాక్ వినిపిస్తోంది.  దీంతో నిర్మాత సి. కల్యాణ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయమైపోయినట్లే అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

అసలు ఈ ఎన్నికలు మొదలైనప్పుడు మాత్రం సీన్ వేరేలా ఉంది. ఒకవైపు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్', మరోవైపు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతుతో బండ్ల గణేష్ ఉన్న 'గిల్డ్ ప్యానెల్' రంగంలోకి దిగింది. దీంతో సెప్టెంబర్ 6న జరిగే ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కౌన్సిల్ లోని సభ్యులుగా ఉన్న మొత్తం 800 మంది నిర్మాతలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు ప్రకటించేలా షెడ్యూల్ ఖరారైంది

అయితే చివరి దశలో బండ్ల గణేష్ తప్పుకోవడంతో లెక్కలన్నీ మారిపోయాయి. సి.కళ్యాణ్‌కు ఇప్పుడు అధ్యక్ష పదవి దాదాపు ఏకగ్రీవంగా ఖరారైనట్టే అని సమాచారం. ఇప్పటికే ఆయన ప్యానెల్ కూడా బలంగా ఉంది. చదలవాడ శ్రీనివాసరావు ట్రెజరర్‌గా, తుమ్మలపల్లి ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి సెక్రటరీ పదవులకు, అమ్మిరాజు, రామ సత్యనారాయణ జాయింట్ సెక్రటరీ పదవులకు బరిలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో అసలు కీలక అంశం మాత్రం చిన్న నిర్మాతల సమస్యలు. కౌన్సిల్‌లో దాదాపు 70 శాతం మంది చిన్న నిర్మాతలేనని, వారి సమస్యలే తమ ప్యానెల్ ప్రధాన అజెండా అని 'మన ప్యానెల్' చెబుతోంది. మెడిక్లైమ్ పరిమితిని పెంచడం, ఒక్క సినిమా చేసిన నిర్మాతకూ ఆరోగ్య బీమా అందించడం, విద్య-పెళ్లి వంటి అవసరాలకు ఆర్థిక సాయం, చిన్న సినిమాలకు ఓటీటీ బిజినెస్ అవకాశాలు కల్పించడం వంటి హామీలు ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చిన్న నిర్మాతల మద్దతు సి.కల్యాణ్ కే పుష్కలంగా ఉందని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బరి నుంచి తప్పుకున్నట్లు, గానీ నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేష్ అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నో నెలల ఉత్కంఠ, వివాదాలు, డిమాండ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్ 6న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకే ఫలితాలు వెలువడనున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ వర్సెస్ స్మాల్ ప్రొడ్యూసర్స్ మధ్య జరుగుతున్న ఈ వార్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి..