జగిత్యాల: జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 90 ఏళ్ల వయసులో 60వ పెళ్లి రోజు వేడుకలను ఈ అవ్వాతాత సంబురంగా జరుపుకున్నారు. మెట్ పల్లి రాంనగర్కు చెందిన చిలివేరి గంగారం, నర్సు బాయి దంపతుల 60వ వివాహ వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
గంగారం, నర్సుబాయిలకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. దీంతో.. ఈ పెద్దల పెళ్లికి వీళ్లకు పుట్టిన సంతానం, వాళ్ల సంతానం అతిథులుగా మారిన ముచ్చటైన వేడుక ఇది.
కుటుంబ సభ్యులు, మనవళ్ళు, మనవరాళ్లు ఈ పెళ్లిలో ధూం ధాం చేశారు. తాతను పెళ్ళికొడుకులా, అవ్వను పెళ్లికూతురులా అలంకరించి పెళ్లి చేశారు. ఈ పెళ్లిలో ఈ దంపతులు దండలు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేయించారు.
డీజే స్టెప్పులకు నృత్యాలు చేసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. వృద్ధ దంపతుల పెళ్లి వేడుకల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
