వాట్సాప్ యూజర్ల కోసం మెటా సంస్థ మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ ఇంటికి సంబంధించిన రకరకాల యుటిలిటీ బిల్ పేమెంట్స్ నేరుగా వాట్సాప్ యాప్ ద్వారా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. భారత్ కనెక్ట్ (బీబీపీఎస్) నెట్‌వర్క్ ఆధారంగా పనిచేసే ఈ కొత్త బిల్లు చెల్లింపుల సేవ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 విభాగాలకు చెందిన 22వేల 722 పైచిలుకు బిల్డర్లను యాక్సెస్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.
కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లులు, ఫాస్టాగ్ రీచార్జ్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ రీపేమెంట్లు వంటి అనేక రకాల చెల్లింపులను దీని ద్వారా సులభంగా చేయవచ్చు. వాట్సాప్ హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉండే రూపాయి (₹) ఐకాన్‌పై ట్యాప్ చేసి యూజర్లు ఈ సర్వీసెస్ పొందవచ్చు. గతంలో చెల్లించిన బిల్లులతో పాటు రాబోయే బిల్ వివరాలను చూసుకోవడం, ఒకే బిల్డర్ కింద ఖాతాలను నిర్వహించడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. యూపీఐ, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా నచ్చిన మోడ్‌లో పేమెంట్స్ చేసేయొచ్చు.
ఫ్యామిలీ సభ్యులతో చాట్ చేయడం నుంచి మెట్రో టికెట్లు, ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వరకు వాట్సాప్ ఎలా సులభతరం చేసిందో, ఇప్పుడు బిల్లుల చెల్లింపులను కూడా అంతే సులభం చేస్తున్నామని మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్ కాగా.. ప్రస్తుతం ఇక్కడ 60 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.
భారత మార్కెట్లో వాట్సాప్ పేమెంట్స్ సర్వీస్ వినియోగం వేగంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే వాట్సాప్ పే లావాదేవీలు భారీగా దూసుకెళ్తున్నాయి. 2024 జూన్‌లో కేవలం 3.7 కోట్ల లావాదేవీలు మాత్రమే నమోదు కాగా.. 2026 జూన్ నాటికి అది ఏకంగా 15 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినంత ఈజీగా బిల్ పేమెంట్స్ చేసేలా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ డిజిటల్ ఆర్థిక రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.
