ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి ఉద్వాసన తప్పలేదు. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు సీఎంవో ప్రకటించింది. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిలో నియమించింది.
వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌పేట సభలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై, పార్టీ హైకమాండ్‌పై చిన్నారెడ్డి పలు ఆరోపణలు చేయడంతో ఆయనపై వేటు పడింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. కుడా చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు.
కొన్నాళ్ల క్రితం ఓ బహిరంగ వేదికపై చిన్నారెడ్డి.. తన అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారంటూనే.. అన్నీ చూస్తూ భరిస్తున్నానని.. లేకపోతే జీవన్ రెడ్డిలా ఎప్పుడో మాదిరిగా పార్టీ మారేవాడినంటూ వ్యాఖ్యానించారు.
అధిష్టానం నాకు టికెట్ ఇవ్వమని చెప్పినా.. రాష్ట్రంలో అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీని స్వార్థంతో కూలగొట్టటానికి ప్రయత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు చిన్నారెడ్డి. కొంత మంది డబ్బులకు ఆశపడి నాకు అన్యాయం చేస్తున్నారని.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందంటూ ఆ సమావేశంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు చిన్నారెడ్డి.
పార్టీలో అంతర్గత సమస్యలను సమన్వయ కమిటీ ఎదుట చర్చించి పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని బహిరంగ వేదికలపై ఆవేదన వ్యక్తం చేయటంపై పార్టీ సీరియస్ అయ్యింది. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాల్సిన అంశాన్ని.. వేదికలపై విమర్శలు, ఆరోపణలు చేయటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది.
ఈ క్రమంలోనే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి జి.చిన్నారెడ్డికి ఉద్వాసన పలికింది కాంగ్రెస్ ప్రభుత్వం. చిన్నారెడ్డి స్థానంలో కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మికి ఇచ్చారు.
