కోల్కతాలో టీఎంసీ ఆఫీస్‌‌పై దాడి

కోల్కతాలో టీఎంసీ ఆఫీస్‌‌పై దాడి
  •     బీజేపీ మద్దతుదారులే కారణమన్న ఎంపీ అభిషేక్ బెనర్జీ
  •     ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌కతాలోని కామక్ స్ట్రీట్‌‌లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కార్యాలయంపై కొందరు దుండగులు అర్ధరాత్రి దాడి చేశారు. బీజేపీ మద్దతున్న సాయుధ మూకలే ఈ విధ్వంసానికి పాల్పడినట్లు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆఫీసులోకి చొరబడిన దుండగులు.. కార్యకర్తలపై దాడి చేసి, మొబైల్స్ లాక్కున్నారు. ఫర్నిచర్, టీవీలు, ప్రింటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. 

ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గవర్నర్, కేంద్ర హోంమంత్రి, ప్రధాని కార్యాలయం దీనిపై జోక్యం చేసుకోవాలని, ఈ ఘటనపై కోల్​కతా హైకోర్టు సుమోటోగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా టీఎంసీ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పూర్తిగా ఖండించారు. తమ పార్టీ ప్రతీకార రాజకీయాలను నమ్మదని, ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తల ప్రమేయంలేదని స్పష్టం చేశారు. టీఎంసీ రాజకీయ లబ్ధి కోసమే ఈ డ్రామా ఆడిందని బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ఆరోపించారు. అంత ఉదయాన్నే టీఎంసీ కార్యకర్తలు ఆఫీసులో ఏం చేస్తున్నారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇటీవల ఇదే ఆఫీసు వద్ద  హోర్డింగ్ తొలగింపు వివాదం తలెత్తడం, తాజాగా ఈ దాడి జరగడం కోల్‌‌కతా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.