మేకల కాపరిపై ఎలుగుబంట్ల దాడి.. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఘటన

మేకల కాపరిపై ఎలుగుబంట్ల దాడి.. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఘటన
  •     తీవ్రంగా గాయపరిచిన మూడు గుడ్డెలుగులు
  •     వాటితో పోరాడి తీవ్రగాయాలతో బయటపడ్డ వ్యక్తి

తిర్యాణి, వెలుగు: అడవిలో మేకలు మేపేందుకు వెళ్లిన వ్యక్తిపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. వాటితో ఒంటరిగానే పోరాడి ఆ వ్యక్తి బయటపడ్డాడు. తీవ్ర గాయాలైనా ధైర్యం కోల్పోకుండా మూడు కిలోమీటర్లు పడుతూ లేస్తూ నడిచి గ్రామానికి చేరుకున్నాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం రోంపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోంపల్లి పంచాయతీ నాయకపుగూడకు చెందిన మోడితే శంకర్‌‌‌‌(54) గురువారం మేకలను మేపేందుకు రోంపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. 

మేకలు మేస్తుండగా ఒక్కసారిగా మూడు ఎలుగుబంట్లు శంకర్‌‌‌‌పై దాడి చేశాయి. ఆయన తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఓ చేయి విరిగింది. అయినా ధైర్యం కోల్పోకుండా వాటిని ఎదుర్కొని ఎట్టకేలకు తప్పించుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో సుమారు మూడు కిలోమీటర్లు పడుతూ లేస్తూ అడవి నుంచి బయటకు వచ్చి గ్రామానికి చేరుకున్నాడు. 

కుటుంబసభ్యులు చెలిమల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌‌‌‌ చేశారు. ప్రస్తుతం శంకర్‌‌‌‌ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.