- కేంద్ర రైల్వే మంత్రిని కోరిన తుమ్మల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీలోని కేంద్రమంత్రిని కలిసినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. పాండురంగాపురం– మల్కాన్‌గిరి రైల్వే లైన్‌లో జిల్లాలోని సారపాక వరకు16 కి.మీ మేర రైల్వే పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించానన్నారు. రైల్వే లైన్‌కు అవసరమైన భూ సేకరణ చేపట్టి రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ రైల్వే లైన్‌తో భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు.
