సూర్యాపేట టీపీవో ఇంట్లో ఏసీబీ సోదాలు..8 ప్రాంతాల్లో తనిఖీలు.. ఆస్తుల పత్రాలు స్వాధీనం

సూర్యాపేట టీపీవో ఇంట్లో ఏసీబీ సోదాలు..8 ప్రాంతాల్లో తనిఖీలు.. ఆస్తుల పత్రాలు స్వాధీనం

సూర్యాపేట, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వి.సోమయ్యపై ఏసీబీ కేసు నమోదు చేసింది. నల్గొండ రేంజ్‌ ఏసీబీ అధికారులు గురువారం సోమయ్య నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సహచరులకు సంబంధించిన మరో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

సూర్యాపేట జిల్లాలో 3.03 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు సూర్యాపేట, హయత్‌నగర్‌ పరిధిలో ఐదు భవనాలు, సూర్యాపేట పరిధిలో ఎనిమిది ఓపెన్‌ ప్లాట్లతో పాటు రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షలు, 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలను గుర్తించారు. 

ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ మొత్తం రూ.3,54,36,490 ఉంటుందని తెలిపారు. ఆస్తుల కీలక పాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమ్యను ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు.