చిట్యాల, వెలుగు : పాడి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డులో విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పాల ఉత్పత్తిదారులకు రూ. 20 లక్షల విలువైన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శీతలీకరణ కేంద్రం ఏర్పాటుతో చిట్యాల పరిసర ప్రాంతాల పాడి రైతులకు పాల నిల్వ సామర్థ్యం పెరిగి తమ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని, గిట్టుబాటు ధర లభించి వారి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేశ్, నాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు.
