- ప్రైవేట్ వెంచర్‌లో డెవలపర్లు వినియోగించినట్లు గుర్తింపు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్‌లోని బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో డిటోనేటర్లు కలకలం రేపాయి. ఆయుధాల చోరీ మిస్టరీ వీడకముందే.. రెజిమెంట్ ఫైరింగ్ క్యాంప్ సమీపంలో ఎలక్ట్రిక్ వైర్లు, డిటోనేటర్లు బయటపడటంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లోని చెట్ల పొదల్లో సోదాలు చేస్తుండగా.. ఫైరింగ్ క్యాంప్ సమీపంలో ఓ బకెట్‌ను గుర్తించారు. అందులో ఎలక్ట్రిక్ వైర్లతో పాటు 8 బండిల్స్‌లో మొత్తం 160 డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు.
దీంతో అప్రమత్తమై మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యుల బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్, జాగిలంతో తనిఖీలు చేసింది. వాటిలో ఎలాంటి జిలెటిన్ స్టిక్స్ లేవని నిర్ధారించుకున్నాక డిటోనేటర్లను స్వాధీనం చేసుకుంది. కాగా ఇవి ఆర్మీ ప్రాంతంలో లభించలేదని, పక్కనే ఉన్న ప్రైవేట్ వెంచర్‌లో డెవలపర్లు కనీసం ఏడాది లేదా అంతకంటే ముందే వీటిని ఉపయోగించి ఉండవచ్చని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇవి ఆర్మీకి చెందినవి కాదని, తుపాకులు మాయమైన ఘటనకు ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
