ఆర్మూర్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలిచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యంగా పారేస్తారా అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం ఆర్మూర్ తహసీల్ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. వివిధ సెక్షన్లలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ప్రజలిచ్చిన దరఖాస్తులు కంప్యూటర్ సెక్షన్లో టేబుల్ కింద పడేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం దరఖాస్తులపై ఆరా తీసి ఎంపిక ఏవిధంగా చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ సుజాతకు సూచించారు.
