- 2022లో నిజామాబాద్ లో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్
- సబ్ రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్, మరో ఆరుగురిపై కేసు
నిజామాబాద్, వెలుగు : నిషేధిత జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 2022లో నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన, ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఖుద్సియా బాదర్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదుకాగా.. గతంలోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు విషయాన్ని ఆమెకు చెప్పడంతో బుధవారం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. దీంతో ఆమెను రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ నగర శివార్లలోని అర్సాపల్లి సర్వే నంబర్ 169/3లో సైదాఖాతున్ అనే మహిళ పేరిట ఉన్న 4,840 గజాల భూమిలో కొంత భాగం మార్చి 2009లో మహ్మద్ అబ్దుల్ ఎజాజ్ పేరుపై మారింది. అబ్దుల్ ఎజాజ్ ఆ ల్యాండ్‌ను ప్లాట్లుగా మార్చి మలేఖాబేగం అనే మహిళకు మార్చిలోనే విక్రయించారు.
ఆ తర్వాత మరి కొన్ని లావాదేవీలు జరిగే క్రమంలో ఓనర్ షిఫ్ వివాదం తలెత్తింది. దీంతో ఆ భూమిని నిషేధిత లిస్ట్ లో పెడుతూ 2022 అక్టోబర్ 18న అప్పటి జిల్లా రిజిస్ట్రార్ మెమో జారీ చేశారు. 2022లో నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన ఖుద్సియా బాదర్ జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాలు పాటించకుండా.. నిషేధిక జాబితాలో ఉన్న భూమిని ఏడుగురు వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసింది. సుమారు రూ.5 కోట్ల విలువైన ఈ వ్యవహారంలో ఓ డాక్యుమెంట్ రైటర్ కీలక పాత్ర పోషించినట్లు, ఖుద్సియా బాదర్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు రూల్స్ ఉల్లంఘించినట్లు, ఇద్దరు కార్పొరేటర్ల హస్తం కూడా ఉన్నట్లు తెలిసింది.
విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో రికార్డులు పరిశీలించగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో మాండా జయ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆమెను అదుపులో తీసుకున్న విచారించగా.. తనకు సంబంధం లేదని, రూ.40 వేలు ఇస్తానంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లినట్లు చెప్పింది. ఈ క్రమంలో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మాండా జయతో పాటు అజ్వతుల్లాఖాన్‌ను నెల కింద అరెస్ట్ చేశారు.
మరో నలుగురు కోర్టు నుంచి యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా సబ్ రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్ సరెండర్ కావడంతో రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ కోసం ఆమెను పోలీస్ కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమెను విచారించిన మరో ఇద్దరు ఉద్యోగులను సైతం అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిషేధితజాబితాలో ఉన్న ఇంకా ఏయే భూముల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి ? అనే విషయంపై విచారణ చేస్తున్నారు.
ఉప్పల్ లో 35 ప్లాట్లకు..
ఉప్పల్, వెలుగు : ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అర్బన్ల్యాండ్సీలింగ్యాక్ట్ పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పీర్జాదిగూడ పరిధిలోని సర్వే నంబర్లు 38,39,43,44కు సంబంధించి యూఎల్‌సీలో ఉన్నట్లు చూపిస్తున్న 35 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ అంశంపై ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జిల్లా రిజిస్ట్రార్ అశోక్‌కుమార్ విచారణ జరిపి నిజమేనని తేల్చారు. కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగింది నిజమేనని, ఇంకా నిషేధిత జాబితాలో ఉన్న ప్లాట్లు ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారో త్వరలోనే తేలుతుందన్నారు.
తప్పు జరిగింది : ఉప్పల్ సబ్‌రిజిస్ట్రార్
‘తప్పు జరిగింది నిజమే, కొందరి ఒత్తిడి వల్ల కొన్ని డాక్యుమెంట్లు చేయాల్సి వచ్చింది’ అని ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్విజయ జ్యోతి వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పు జరగకుండా చూస్తానని, లంచం తీసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు మాత్రం అబద్దమన్నారు. కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏ రూల్స్ప్రకారం జరిగాయి? యూఎల్‌సీ పరిధిలోని భూములకు రిజిస్ట్రేషన్ అనుమతి ఎలా లభించింది?’ అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
