తిరువనంతపురం: కేరళలోని మార్ థోమా చర్చిలో జరిగే వివాహాలకు ముందు హెచ్‌ఐవీ పరీక్షను తప్పనిసరి చేయాలని ఆ చర్చి సీనియర్ ప్రీస్ట్ కె.థామస్ సూచించారు. ఈ వ్యాఖ్యలు గురువారం టీవీ చానెళ్లలో ప్రసారమవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల థామస్ తిరువనంతపురంలో నిర్వహించిన చర్చి సమావేశంలో పేరెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
వివాహం కోసం కుమార్తెలను చర్చికి తీసుకొచ్చే ముందు వారి శరీరం ‘దుర్వినియోగానికి గురికాలేదని’ నిర్ధారించుకోవాలని సూచించారు. కర్నాటక ప్రభుత్వం కాలేజీ ప్రాంగణాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొంటూ, చర్చిలో జరిగే వివాహాలకు ముందు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశం ఉద్దేశం తల్లిదండ్రులకు హెచ్ఐవీ విషయంలో అవగాహన కల్పించడమేనని అన్నారు. కాగా, ప్రీస్ట్ థామస్ మాటలు మార్ థోమా చర్చికి చెందిన యువతను అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
