కొండా సురేఖ బీజేపీలో చేరిక ఊహాగానాలే : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

కొండా సురేఖ బీజేపీలో చేరిక ఊహాగానాలే :  బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కొండా సురేఖ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ స్టేట్ చీఫ్​ రాంచందర్‌‌‌‌రావు స్పందించారు. అవి ఊహాగానాలేనని కొట్టిపారేశారు. విమానాశ్రయంలో సురేఖను కలవడం కేవలం మర్యాదపూర్వక పలకరింపేనని, దానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆహ్వానించడం, చేర్చుకోవడంపై నిర్ణయం పార్టీ జాతీయ నాయకత్వం పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం కాంగ్రెస్‌‌‌‌ అంతర్గత విషయమే అయినా.. ఆమె కూతురి వ్యాఖ్యలతో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి బయటపడిందన్నారు. 

ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ కాదని.. కాంగ్రెస్‌‌‌‌ నేతలే ప్రభుత్వం 30 శాతం కమీషన్లతో నడుస్తోందని చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌లోని వర్గపోరు, అంతర్గత తగాదాల కారణంగానే నేతలపై వేట్లు పడుతున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, పితృస్వామ్య భావజాల నిర్మూలన అంటూ రాహుల్‌‌‌‌ గాంధీ చెప్పే మాటలకు కాంగ్రెస్‌‌‌‌ చేతలకు పొంతన లేదని రాంచందర్‌‌‌‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌ పాలిత రాష్ట్రాలు హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌, కర్నాటకలో మహిళా మంత్రులు లేరని అన్నారు. తెలంగాణలో ఉన్న ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరిని అర్ధంతరంగా పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. మహిళలకు కాంగ్రెస్‌‌‌‌ ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత ఇదేనా అని ప్రశ్నించారు. కొండా సురేఖ బర్తరఫ్‌‌‌‌తో కాంగ్రెస్‌‌‌‌ మహిళా వ్యతిరేక వైఖరి ప్రజల ముందు బయటపడిందని అన్నారు.