యూపీలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి..చిత్రకూట్ జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

యూపీలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి..చిత్రకూట్ జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం

లక్నో : ఉత్తరప్రదేశ్‌‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని చిత్రకూట్, అమేథీ, బారాబంకీ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వేర్వేరు దుర్ఘటనల్లో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్రకూట్ జిల్లా బరచ్ఛీ గ్రామంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షానికి ఓ మట్టి ఇల్లు కూలింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి, అతడి ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. కలెక్టర్​పుల్కిత్ గార్గ్ కథనం ప్రకారం.. ఇల్లు కూలడంతో కల్లు యాదవ్ (32), ఆయన భార్య కుంట (30), పిల్లలు అంశ్ (5), అన్షిక (3), కల్లి (1) శిథిలాల కింద చిక్కుకున్నారు. 

గ్రామస్తుల సాయంతో వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కల్లు, అంశ్, కల్లి మృతి చెందినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన భార్య కుంట, మరో కూతురు అన్షిక చికిత్స పొందుతున్నారు. అమేథీ జిల్లా నయా పుర్వా గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షానికి మట్టి గోడ కూలి శ్యామ్‌‌లాల్ చౌహాన్ (66) మృతి చెందాడు. బారాబంకీ జిల్లా ధనోలి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి మట్టి గోడ కూలడంతో దాని పక్కన ఉన్న షెడ్ కింద నిద్రిస్తున్న శాలిక్ రామ్ కశ్యప్ (62) మృతి చెందగా, ఆయన అల్లుడు గాయపడ్డాడు. ప్రస్తుతం యూపీలో వరద ప్రభావం ఉన్న 23 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.