మాజీ డీఎస్పీ భీంరెడ్డిపై ఈడీ గురి..మనీలాండరింగ్ కోణంలో ప్రారంభమైన దర్యాప్తు

మాజీ డీఎస్పీ భీంరెడ్డిపై ఈడీ గురి..మనీలాండరింగ్ కోణంలో ప్రారంభమైన దర్యాప్తు
  • ఈసీఐఆర్ నమోదు, ఏసీబీ కేసు రికార్డుల సేకరణ
  • భీంరెడ్డి సహా బినామీలకు త్వరలోనే ఈడీ నోటీసులు
  • జులై 6న భీంరెడ్డిని అరెస్ట్‌‌ చేసిన ఏసీబీ, ఇటీవలే రిలీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: మాజీ డీఎస్పీ భీంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల లెక్కలు తేల్చేందుకు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ కేస్‌‌ ఇన్‌‌ఫర్మేషన్ రిపోర్ట్‌‌ (ఈసీఐఆర్‌‌‌‌) నమోదు చేసింది. భీంరెడ్డి ఆస్తులు, రియల్‌‌ ఎస్టేట్‌‌ సహా భూముల కొనుగోళ్లు, కంపెనీల్లో పెట్టుబడులపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాసింది.

కోర్టు నుంచి సర్టిఫై కాపీలను సేకరించింది. రికార్డుల పరిశీలన అనంతరం భీంరెడ్డి సహా బినామీలకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జూలై 2న ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య జూలై 6న భీంరెడ్డిని అరెస్ట్‌‌ చేశారు. నాటి నుంచి 57 రోజుల పాటు చంచల్‌‌గూడ జైలు రిమాండ్‌‌లో ఉన్న భీంరెడ్డి.. ఈ నెల 1న బెయిల్‌‌పై విడుదలయ్యారు.

సోదాల్లో బయటపడ్డ రూ.200 కోట్ల విలువైన ఆస్తులు

నార్సింగిలోని వెస్సెల్లా మెడోస్​లో గల భీంరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీల ఇండ్లలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఇంట్లో రూ.3.6 లక్షలు నగదు, రెండు కిలోల బంగారం, 20 కిలోల వెండి ఆభరణాలతోపాటు బినామీ నివాసంలో రూ.40 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.19.91 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ సీజ్ చేశారు. వీటితో పాటు గచ్చిబౌలి, తెల్లాపూర్, మణికొండలో అత్యంత ఖరీదైన ఆస్తులను గుర్తించారు. రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ లో రూ.75 లక్షల పెట్టుబడికి సంబంధించి డాక్యుమెంట్లను సీజ్ చేశారు. బెంగళూర్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎకరం భూమితో పాటు కర్నాటకలో 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోమిన్​పేటటలో రెండు ఎకరాలు, జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

ఓ వైపు ఐటీ మరోవైపు ఈడీ దర్యాప్తు 

భీంరెడ్డి సంపాదించిన ఆస్తులు, బినామీ ఆస్తులు, సోదాల్లో పట్టుబడ్డ నగదు లెక్కలు తేల్చేందుకు ఓ వైపు ఐటీ, మరోవైపు ఈడీ సమాంతర దర్యాప్తు చేపట్టాయి. ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ అధికారులు బినామీ చట్టం కింద ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీ అందించిన భూముల పత్రాలతో పాటు నగదు, బినామీల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సేకరించారు. భీంరెడ్డి సహా కుటుంబ సభ్యులు, బినామీలకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.