యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఈ నెల 4న కణ్ణన్ తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం 9 గంటలకు కణ్ణన్ పెరుమాళ్లు, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులకు వేదోక్తంగా ‘నవకలశ స్నపన విశేష తిరుమంజన సేవ’ కైంకర్యాన్ని అర్చకులు నిర్వహించనున్నారు.
కణ్ణన్ తిరునక్షత్రం సందర్భంగా 4న నిత్య కళ్యాణం, శాశ్వత కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నివేదన, భోగాలను తాత్కాలికంగా రద్దు చేశారు. 4న కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు ముగిసిన అనంతరం 6న సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా శిఖ్యోత్సవం(ఉట్లోత్సవం) నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు ప్రధానాలయంలో రుక్మిణీ కళ్యాణోత్సవం చేపట్టనున్నారు
