నారాయణగూడ, వెలుగు: స్టడీ సెంటర్లలో విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.6.70 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 16, 17 తేదీల్లో నారాయణగూడ పరిధిలోని స్టడీ సెంటర్లలో రెండు ల్యాప్‌టాప్‌లు చోరీకి గురయ్యాయి.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సికింద్రాబాద్ పార్శీగుట్టకు చెందిన పాత నేరస్తుడు వినీత్‌ను దొంగగా పోలీసులు గుర్తించారు. బీటెక్ పూర్తి చేసిన వినీత్ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటై అప్పులపాలై ఉద్యోగం కోల్పోయిన తర్వాత చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్టడీ సెంటర్లు ఉన్న ప్రాంతాలను గూగుల్‌లో గుర్తించి బస్సుల్లో అక్కడికి వెళ్లేవాడని, మధ్యాహ్నం విద్యార్థులు భోజనానికి బయటకు వెళ్లిన సమయంలో లోపలికి ప్రవేశించి ల్యాప్‌టాప్‌లు అపహరించేవాడని విచారణలో తేలింది.
నెల రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని 16 పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను పార్శీగుట్టలో సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు తక్కువ ధరకు విక్రయించాడు. దీంతో శ్రీనివాస్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
