మెడికల్ కాలేజీ భవనాలుత్వరగా పూర్తి చేయాలి..మంత్రి దామోదర్ ఆదేశం

మెడికల్ కాలేజీ భవనాలుత్వరగా పూర్తి చేయాలి..మంత్రి దామోదర్ ఆదేశం
  • ఏడాదిలోగా అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచన

హైదరాబాద్, వెలుగు: మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఏడాదిలోపు భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పురోగతి, మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పనితీరుపై గురువారం కోఠిలోని టీజీఎంఎస్‌‌ఐడీసీ ఆఫీస్‌‌లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సుమారు 40 కోట్ల రూపాయలతో నిర్మించిన సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైందని టీజీఎంఎస్‌‌ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు మంత్రికి తెలిపారు. సుమారు రూ.156 కోట్లతో చేపడుతున్న మెదక్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్, నర్సింగ్ కాలేజీ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, ఏడాదిలోగా అన్ని భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కాలేజీలు, హాస్టళ్లు కొనసాగుతున్నాయని, వాటిలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

వెంటనే మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీలు, హాస్టల్ భవనాలను విజిట్ చేయాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు. అవసరమైతే, అన్ని సౌకర్యాలు ఉన్న ఇతర భవనాలను అద్దెకు తీసుకుని, హాస్టళ్లను అక్కడికి మార్చాలని సూచించారు. సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.