లైన్ దాటితే ఎంతటివారైనా వేటు తప్పదు : మల్లు రవి

లైన్ దాటితే ఎంతటివారైనా వేటు తప్పదు : మల్లు రవి
  •     సీఎం, మంత్రులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే: మల్లు రవి 
  •     కూతురు వ్యాఖ్యలను ఖండించనందుకే కొండా సురేఖపై చర్యలు
  •     ‘పదేండ్లు నేనే సీఎం’ అన్న రేవంత్ వ్యాఖ్యలు కేడర్‌‌‌‌‌‌‌‌లో జోష్ కోసమే
  •     టికెట్లు ప్రకటించేది ఏఐసీసీనే అని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీలో లక్ష్మణ రేఖ దాటితే ఎంతటివారిపై అయినా చర్యలు తప్పవని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. సీఎం అయినా.. మంత్రులైనా.. ఏ పదవిలో ఉన్నా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదన్నారు. ఇందుకు మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ఉదాహరణ అని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించకపోవడం వల్లే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రిని ఎవరైనా దూషిస్తే.. మంత్రిగా దాన్ని ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందన్నారు. ఈ విషయంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద కూడా సుస్మిత తప్పు చేసిందని సురేఖ ఒప్పుకోలేదని చెప్పారు. 

కొండా సురేఖ కుటుంబంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడం అలవాటుగా మారిందని ఆరోపించారు. గతంలోనూ సురేఖపై పార్టీకి పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పార్టీ నిర్ణయాలు, చర్యలు కులాల ఆధారంగా ఉండవని స్పష్టం చేశారు. బీసీ కావడం వల్లే సురేఖపై కుట్ర జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కొండా సురేఖ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగాలని పార్టీ కోరుకుంటోందని మల్లు రవి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి టికెట్లు ప్రకటించడం, తానే పదేండ్లు సీఎంగా ఉంటానని చెప్పడం వంటి వ్యాఖ్యలను పెద్దగా సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌లో ఉత్సాహం నింపేందుకే సీఎం ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అభ్యర్థుల టికెట్లను ప్రకటించే అధికారం ఏఐసీసీకే ఉంటుందని స్పష్టం చేశారు.