- యూఎస్ మార్కెట్లో భారత్‌కు ప్రత్యేక వెసులుబాట్లు ఉండాల్సిందే
- 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యం: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: మన షరతులకు అంగీకరిస్తేనే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. గురువారం ఆయన ఢిల్లీలో వాణిజ్య ఒప్పందాల సద్వినియోగంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడారు. ‘ఇతర దేశాల వ్యాపారాలతో పోలిస్తే.. మన వ్యాపారాలు అమెరికాలో సులభంగా ఉండాలి. మన ఉత్పత్తులను ఈజీగా అమ్ముకునేలా అమెరికా ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలి. మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరేలా టారిఫ్ షరతులు ఉంటేనే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసి తుది వివరాలను ప్రకటిస్తాం. మార్కెట్ యాక్సెస్, డిజిటల్ వాణిజ్యం, సప్లయ్ చైన్ వంటి పలు అంశాలపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సుంకాలు తగ్గడం మాత్రమే కాకుండా.. మన దేశ కంపెనీలు ఇతర దేశాల వ్యాపారాల కంటే మెరుగైన నిబంధనలపై పోటీపడాలి. టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు అమెరికాతో మెరుగైన టారిఫ్ షరతులు కలిగి ఉన్నాయి. మన ఎగుమతిదారులు కూడా ఆ స్థాయికి ఎదగాలి.
ప్రస్తుతం భారత్ దాదాపు 60 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన దేశాలతో తొమ్మిది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ)లను కలిగి ఉంది.ఈ ఎఫ్‌టీఏల ప్రయోజనాలు మన దేశంలోని అన్ని జిల్లాలకు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, తొలిసారి ఎగుమతి చేసే వారికి అందేలా విస్తృత ప్రచారం చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 317 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే, 2030 నాటికి ఎగుమతులను 2 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే కేంద్రం లక్ష్యం. ఇప్పటికే పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అమల్లో ఉండగా, మరికొన్ని దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా, భారతీయ
కంపెనీలకు నిజంగా విదేశీ ఆర్డర్లు వచ్చేలా ఈకామర్స్ రంగాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి’ అని పీయూష్ గోయల్ సూచించారు.
