అబిడ్స్, వెలుగు : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో శుక్రవారం నిర్వహించనున్న శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డీ. జోయెల్ డేవిస్ తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి సెప్టెంబర్ 5న అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇస్కాన్ ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు జాయింట్ సీపీ తెలిపారు.
ఆంక్షలు ఇలా..
ట్రూప్ బజార్ యూసుఫ్ అండ్ కంపెనీ, జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డు, అబిడ్స్ సర్కిల్, పాత హైదరాబాద్ కలెక్టరేట్, చిరాగ్ అలీ లేన్, నాంపల్లి స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, అందుకని వాహనదారులు ఆల్టర్నేట్రూట్లు చూసుకోవాలన్నారు. గన్‌ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ల నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే వాహనాలను జీపీఓ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువైతే ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తామన్నారు.
జాంబాగ్ రోడ్, ఎస్‌ఏ బజార్ మసీదు నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాల రద్దీ పెరిగితే ఎంజే మార్కెట్ వద్ద గాంధీభవన్, చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తామన్నారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ నుంచి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను భారత్ పెట్రోల్ పంప్ వద్ద ఎడమవైపు మళ్లించి, పాత ఏసీబీ లేన్, యూసుఫ్ అండ్ కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా కోఠి బ్యాంక్ స్ట్రీట్‌కు పంపిస్తామన్నారు. బీజేపీ స్టేట్ఆఫీసు వైపు నుంచి వచ్చే వాహనాలను పాత హైదరాబాద్ కలెక్టరేట్జంక్షన్ వైపు అనుమతించకుండా ఎంజే మార్కెట్ రోడ్ వైపు పంపిస్తామన్నారు.
ఆర్టీసీ బస్సులు కూడా..
అబిడ్స్ ఇస్కాన్ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని బట్టి ఆర్టీసీ బస్సులనూ దారి మళ్లించనున్నట్లు జోయెల్ డేవిస్ తెలిపారు. రంగమహల్, జాంబాగ్ రోడ్ నుంచి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ వద్ద జీపీఓ జంక్షన్, అబిడ్స్ సర్కిల్ వైపు అనుమతించకుండా గాంధీభవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు పంపిస్తామన్నారు. ఎస్‌ఏ బజార్ మసీదు, అఫ్జల్‌గంజ్ నుంచి వచ్చే బస్సులను కూడా ఎంజే మార్కెట్ వద్ద జీపీఓ వైపు కాకుండా గాంధీభవన్ రోడ్, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తామన్నారు.
లిబర్టీ, బషీర్‌బాగ్ నుంచి వచ్చే బస్సులను బీజేఆర్ సర్కిల్ వద్ద జీపీఓ వైపు వెళ్లకుండా ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తామన్నారు. రవీంద్రభారతి, హెచ్‌టీపీ జంక్షన్ నుంచి వచ్చే బస్సులను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించకుండా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని సూచించారు.
