- రాహుల్ గాంధీకి ఓబీసీ విద్యార్థుల విజ్ఞప్తి
- ఏఐవోబీసీఎస్‌ఏ ‘హైదరాబాద్ డిక్లరేషన్’ అందజేత
న్యూఢిల్లీ, వెలుగు: జనగణనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐవోబీసీఎస్‌ఏ) విజ్ఞప్తి చేసింది. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏఐవోబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ నేతృత్వంలో ఓబీసీ విద్యార్థి నేతల ప్రతినిధి బృందం రాహుల్‌ను కలిసింది. ఈ బృందంలో జేఎన్‌యూ, డీయూ, హెచ్‌సీయూ విద్యార్థి ప్రతినిధులు దీపా కుమారి, రాకేశ్ దత్తా, పింకి, శశికాంత్, రాకేశ్ కుమార్, జయంత్ యాదవ్, రజని పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన అసోసియేషన్ 7వ జాతీయ మహాసభల్లో ఆమోదించిన ‘హైదరాబాద్ డిక్లరేషన్’ పత్రాన్ని ఈ సందర్భంగా వారు రాహుల్‌కు అందజేశారు. సమగ్ర, శాస్త్రీయ కులగణన చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆదాయ పరిమితిపై సుప్రీం తీర్పును అమలు చేయాలి
ఓబీసీ నాన్–క్రిమిలేయర్ గుర్తింపు విషయంలో తల్లిదండ్రుల జీతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల వేలాది మంది అర్హులైన విద్యార్థులు, ఉద్యోగార్థులు నష్టపోతున్నారని రాహుల్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌ల పెంపుతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ తదితర సామాజిక న్యాయ అంశాలపై పార్లమెంట్‌లో పోరాడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల అభ్యర్థనలపై రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
