న్యూఢిల్లీ: దేశీయ ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఫ్లై91’ భారీ విస్తరణ దిశగా కీలక అడుగు వేసింది. దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,400 కోట్ల) విలువైన 40 కొత్త ఏటీఆర్ 72–600 టర్బో-ప్రాప్ విమానాల కొనుగోలుకు గురువారం ఆర్డర్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతీయ ఎయిర్‌లైన్ ఏటీఆర్ సంస్థకు ఇచ్చిన అతిపెద్ద సింగిల్ ఆర్డర్ ఇదే కావడం విశేషం. ఎయిర్‌బస్, లియోనార్డో కంపెనీల జాయింట్ వెంచరే ఈ ఏటీఆర్ కంపెనీ. ఈ విమానాల డెలివరీలు 2027 చివరి నుంచి ప్రారంభమై 2032 నాటికి పూర్తి కానున్నట్లు ఫ్లై91 సీఈఓ మనోజ్ చాకో వెల్లడించారు. ప్రస్తుతం 6 విమానాలతో వారానికి 280 సర్వీసులను ఈ సంస్థ నడుపుతోంది.
