- క్రమశిక్షణ బాధ్యత వర్సిటీలదేనన్న కోర్టు
- లా స్టూడెంట్లకు, న్యాయవాదులకు తేడా ఉందని వెల్లడి
- నల్సార్ స్టూడెంట్ల ఎన్‌రోల్‌మెంట్‌పై ఆంక్షల సర్క్యులర్లు కొట్టివేత
న్యూఢిల్లీ: లా స్టూడెంట్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు కానీ, అధికారం కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లా విద్యార్థులకు, కోర్సు పూర్తి చేసుకుని న్యాయవాదులుగా ఎన్‌రోల్ అయ్యేవారికి మధ్య తేడా ఉంటుందని గుర్తుచేసింది. విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే పూర్తి హక్కు కేవలం ఆయా యూనివర్సిటీలకే ఉంటుందని తేల్చిచెప్పింది. స్టూడెంట్లు ఎన్‌రోల్ చేసుకునే సమయం వచ్చినప్పుడే బార్ కౌన్సిల్ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, అంతేకాని ముందస్తుగా వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు నిరసన తెలపడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన బార్ కౌన్సిల్.. నిరసన తెలిపిన విద్యార్థులు ఎన్‌రోల్ కాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ మిహిరా సూద్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన త్రిసభ్య బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
అన్ని రకాల సర్క్యులర్లు కొట్టివేత
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ వాదిస్తూ.. విద్యార్థుల అకడమిక్ స్వేచ్ఛను, క్రమశిక్షణను నియంత్రించే అధికారం బార్ కౌన్సిల్‌కు లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బార్ కౌన్సిల్ తరఫున బీసీఐ చైర్మన్, సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా వాదిస్తూ.. తాము ఆ వివాదాస్పద ఉత్తర్వులను ఇప్పటికే వెనక్కి తీసుకున్నామని తెలిపారు. బీసీఐ ఆదేశాలు అమలులోకి రాకముందే అదేరాత్రి వాటిని వాపస్ తీసుకున్నామని చెప్పారు. కమ్యూనికేషన్లను ఉపసంహరించుకున్న తర్వాత విచారించడానికి ఏమీలేదని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు.. బార్ కౌన్సిల్ లేఖలను వెనక్కి తీసుకున్నంత మాత్రాన అధికార పరిధికి సంబంధించిన పెద్ద ప్రశ్నకు సమాధానం దొరకదని పేర్కొంది. లా విద్యార్థుల క్రమశిక్షణ పూర్తిగా యూనివర్సిటీ పరిధిలోని అంశమని, చట్టపరంగా విద్యార్థులపై చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదని తేల్చిచెప్పింది. యూనివర్సిటీలు అనుమతించి కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్‌కు వస్తేనే నిబంధనల ప్రకారం బీసీఐ పరిశీలించాలని స్పష్టంచేస్తూ బార్ కౌన్సిల్ జారీ చేసిన అన్ని రకాల సర్క్యులర్లను కోర్టు కొట్టేసింది.
