- రూ.2వేల944 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
- 2 శాతం కమీషన్ చెల్లింపుకు జలమండలి ఆమోదం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్–2, 3) కోసం హడ్కో మంజూరు చేసిన రూ.2,944 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నింపేందుకు జలమంలి రూ.7,360 కోట్లు ఖర్చు చేస్తున్నది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్దతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 60 శాతం నిధులను కాంట్రాక్ట్ ఏజెన్సీ భరిస్తుండగా, మిగతా 40 శాతం వాటాను హడ్కో రుణ సాయం ద్వారా సేకరిస్తున్నారు. జూన్ 6, 2026న జలమండలి హడ్కో మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. పూర్తి ప్రభుత్వ గ్యారంటీ ఇస్తున్నందున, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జలమండలి రాష్ట్ర ప్రభుత్వానికి 2 శాతం గ్యారంటీ కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం జీవో విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా లోన్ ప్రక్రియను పూర్తి చేసి, తదుపరి చర్యలు వెంటనే చేపట్టాలని జలమండలి ఎండీని ఆయన ఆదేశించారు.
