బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం : సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతి

బొగ్గు ఉత్పత్తి కన్నా  ఉద్యోగుల భద్రతే ముఖ్యం : సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతి

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆ సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్ జ్యోతి స్పష్టం చేశారు. ప్రమాదరహిత సింగరేణి సాధన కోసం తగు చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని సింగరేణి భవన్‌‌‌‌లో గురువారం 50వ త్రైపాక్షిక భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) అధికారులు, సింగరేణి అధికారుల సంఘం, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొని గనుల్లో రక్షణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల అమలు తీరు, పునరావృతమవుతున్న పొరపాట్లు, ప్రమాదరహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీపై చర్చించారు. మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ సగేశ్ కుమార్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య తగ్గడం అభినందనీయమన్నారు. ఓపెన్‌‌‌‌కాస్ట్ గనుల్లో సింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఒకేచోట బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసే పద్ధతిని వెంటనే అమలు చేయాలని సూచించారు. ఉద్యోగుల రక్షణ పెంపునకు తగిన శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.