ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (కేపీకే) ప్రావిన్స్‌లోని అఫ్గాన్ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన ముఠా దేశంలోకి చొరబడేందుకు యత్నించగా, బలగాలు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశాయి.
36 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐఎస్‌పీఆర్ తెలిపింది. అఫ్గాన్ గడ్డను ఉగ్రవాదులు వాడుకోకుండా నిరోధించడంలో తాలిబాన్ పాలకులు విఫలమయ్యారని పాక్ సైన్యం మండిపడింది. మరోవైపు, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో మరో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక కస్టమ్స్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయి.
