ఆగిన మర మగ్గం..సిరిసిల్లలో కాటన్ కార్మికుల సమ్మె..కూలి రేట్లు పెంచాలని డిమాండ్

ఆగిన మర మగ్గం..సిరిసిల్లలో కాటన్ కార్మికుల సమ్మె..కూలి రేట్లు పెంచాలని డిమాండ్
  • ఒక్కో చీర ఉత్పత్తిపై రూ.100, ఆసాములకు రూ.150 పెంచాలని విజ్ఞప్తి
  • యజమానులు, కార్మికుల మధ్య కుదరని కూలి ఒప్పందం
  • రెండేండ్లుగా కూలి పెంచడం లేదని కార్మికుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్లలో నేతన్నల జీవనాధారమైన సాంచాలు మూగబోయాయి. రెండేండ్లుగా కూలి రేట్లు పెంచకపోవడంతో కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరమగ్గాల కార్మికులు, ఆసాములు సమ్మె బాట పట్టారు. ఆగస్టు 31 నుంచి ఉత్పత్తిని నిలిపివేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కూలీ పెంచాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ నాలుగో రోజూ నిరసనలు కొనసాగిస్తున్నారు.

 సిరిసిల్లలో దాదాపు 500 వరకు కాటన్ మరమగ్గాలు ఉన్నాయి.200 మంది కార్మికులు, 100 మంది ఆసాములు కాటన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా కొంతకాలంగా తమ కూలి పెంచాలంటూ యాజమానులను డిమాండ్ చేస్తున్నారు. అయినా యజమానులు స్పందించకపోవడంతో చేసేదేమీ లేక సమ్మె బాట పట్టారు. ఆగస్టు 31 నుంచి సమ్మెలోకి దిగడంతో సాంచాల చప్పుడు ఆగిపోయింది.

ఒప్పందం గడువు ముగిసి రెండేండ్లయినా..

కాటన్ పరిశ్రమలో పని చేసే కార్మికులకు యజమానులు ప్రస్తుతం ఒక్కో చీర ఉత్పత్తిపై కూలి రూ.82.50 చెల్లిస్తున్నారు. ఆసాములకైతే రూ.132.50 ఇస్తున్నారు. ఈ ఒప్పందం 2022 మేలో జరిగింది. అప్పట్నుంచి ఇదే ఒప్పందంపై కూలి చెల్లిస్తున్నారు. ప్రతీ రెండేండ్లకోసారి కూలి పెంచాలన్న రూల్స్​ ఉన్నాయి. 

అయితే గత ఒప్పందం రెండేండ్లు దాటి మరో రెండేండ్లు గడువు ముగిసినా కూలి రేట్లు పెంచకపోడంతో కార్మికులు, ఆసాములు ఆందోళన చెందుతున్నారు. తమకు నిబంధనల ప్రకారం ఒక్కో చీర ఉత్పత్తిపై కార్మికులకు రూ.100 పెంచాలని, ఆసాములకు రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.

నాలుగో రోజుకు సమ్మె..

కాటన్ కార్మికులు, ఆసాములు చేస్తున్న సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరింది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్ అంబభవాని ఫంక్షన్ హాల్లో కార్మికులు, ఆసాములు కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు తీస్తూ రోజూ ఒక రూపంలో నిరసనలు తెలుపుతున్నారు.

కూలి పెంచే వరకు సమ్మె ఆపం

కాటన్ కార్మికులకు, ఆసాములకు కూలి పెంచే వరకు సమ్మె ఆపేది లేదు. ఒప్పంద గడువు ముగిసి రెండేళ్లు దాటినా కూలి పెంచకుండా యజమానులు శ్రమ దోపిడీ చేస్తున్నారు. కార్మికులు, ఆసాములు వాటాలు అడగట్లేదు. శ్రమకు తగ్గ కూలిని మాత్రమే అడుగుతున్నారు. నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా యజమానులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం సరికాదు.

-కోడం రమణ, సీఐటీయూ నాయకుడు-

పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెంచాలి


ప్రస్తుతం నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి. ఒక చీర ఉత్పత్తి చేస్తే కూలీ రూ.82 ఇస్తున్నారు. కనీసం రూ.100కు పెంచాలి. యజమానులు కార్మికుల కష్టాలను అర్థం చేసుకోవాలి.

- వెల్దండి మోహన్, కాటన్ కార్మికుడు, సిరిసిల్ల-