- అనుహ్యంగా పదవి దక్కించుకున్న గ్రేటర్ మాజీ మేయర్
- ఎప్పటినుంచో కుడా పోస్టుపై సీనియర్ నేతల ఆశలు
- మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌తో అదే సామాజికవర్గం నుంచి సుధారాణికి చాన్స్
వరంగల్, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‍పర్సన్‍గా గ్రేటర్ వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి నియామకమయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గురువారం నియామక ప్రకటన చేసింది. ఇదే గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మంత్రి సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బర్తరఫ్ కాగా.. అదే బీసీ సామాజికవర్గానికి చెందిన సుధారాణికి ‘కుడా’ అవకాశం దక్కింది.
ఓరుగల్లు ‘కుడా’ పవర్‍ఫుల్
వరంగల్ అభివృద్ధిలో కీలకంగా ‘కుడా’ కీలకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, జీడబ్ల్యూఎంసీ ఫండ్స్‌తో సంబంధం లేకుండా సొంతంగా దాదాపు రూ.500 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1,805 చదరపు కిలోమీటర్లు కుడా పరిధిలోకి వస్తుంది. కాగా గ్రేటర్‌లో ప్రస్తుతం ‘వరంగల్ మాస్టర్‍ప్లాన్ 2041’ అమలు చేస్తుండగా ‘కుడా’ పరిధిని దాదాపు మరో 1000 చదరపు కిలోమీటర్లు పెంచాలని భావించారు. ఇందుకోసం 271 రెవెన్యూ గ్రామాలు, 2,738.19 చదరపు కిలోమీటర్లకు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
బీసీ మహిళా నేతగా అవకాశం
బీసీ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన 62 ఏళ్ల గుండు సుధారాణి రాజకీయాల్లో, వివిధ పదవులు, హోదాల్లో మూన్నాలుగు దశాబ్దాలుగా యాక్టివ్‍గా ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో కలిసి పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు టీటీడీ బోర్డు సభ్యురాలిగా, 2005 నుంచి 2010 వరకు గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్‍గా పనిచేసిన సుధారాణి ఆపై రాజ్యసభ మెంబర్ అయ్యారు. బీఆర్‍ఎస్‌లో చేరాక.. తెలంగాణ వుమెన్స్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‍పర్సన్‍గా వ్యవహరించారు. 2021లో అనూహ్యంగా గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి దక్కించుకున్నారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కారు దిగి హస్తం గూటికి చేరారు. 2026 మేలో మేయర్ పదవి కాలం ముగియగా.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో మరోసారి ‘కుడా’ చైర్‍పర్సన్ పదవి దక్కించుకున్నారు. కొండా సురేఖ తరహాలో బీసీ మహిళా కావడంతోపాటు వివిధ పదవుల్లో పనిచేసిన అనుభవం సుధారాణికి కలిసివచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఆశతో ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు
గతంలో కుడా చైర్మన్ పదవి నామమాత్రంగా ఉంది. ప్రస్తుతం సపరేట్‍గా రూ.వందల కోట్ల నిధులు, పెద్ద ప్రాజెక్టులు, నియోజకవర్గాలు, జిల్లాలు దాటే పరిధిలో ప్రొటోకాల్ ఉండటంతో కుడా చైర్మన్ పోస్టుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ‘కుడా’ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా మాజీ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తన పదవి కాలంలో చేసిన అభివృద్ధిని చూపుతూ మరోసారి అవకాశం కల్పించాలని హైకమాండ్ పెద్దలను కలిశారు. వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్‍రెడ్డి తన అనుచరుడైన సీనియర్ కాంగ్రెస్ నేత బత్తిని శ్రీనివాస్ వంటి నేతల కోసం ప్రయత్నాలు చేశారు. స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ చైర్మన్‍గా వ్యవహరించిన జంగా రాఘవరెడ్డి సైతం తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే తరహాలో మరో ఇద్దరు ముగ్గురు ఎవరి ప్రయత్నాల్లో వారు హైకమాండ్, గాడ్ ఫాదర్లను కలిసి ఆ పదవిపై ఆశతో ఉన్నారు.
