టాటాలకు ఎదురుదెబ్బ.. తట్టాబుట్టా సర్థుకుని టాటా కెమికల్స్ కంపెనీని వెళ్లిపొమ్మన్న కెన్యా!

టాటాలకు ఎదురుదెబ్బ.. తట్టాబుట్టా సర్థుకుని టాటా కెమికల్స్ కంపెనీని వెళ్లిపొమ్మన్న కెన్యా!

ఆఫ్రికా దేశమైన కెన్యాలో పారిశ్రామికీకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కెన్యాలో వ్యాపారం చేస్తున్న భారతీయ దిగ్గజ సంస్థ 'టాటా కెమికల్స్'ను కార్యకలాపాలు తక్షణమే నిలిపివేయాలని గురువారం ఆదేశించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం ముడి ఖనిజాలను మాత్రమే ఎగుమతి చేస్తున్నారనే కారణంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రూటో.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రం కజిడో కౌంటీలోని ఖనిజ సంపదతో నిండిన మగాడి సరస్సు. ఈ ప్రాంతంలో గత 2 దశాబ్దాలుగా టాటా కెమికల్స్ సోడా యాష్ ఉత్పత్తికి సంబంధించిన ఖనిజాలను వెలికితీస్తోంది. 2005లో బ్రన్నర్ మోండ్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలుతో టాటా గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. అయితే ఈ ప్రాంతంలో శతాబ్దాలుగా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ, స్థానికంగా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయలేదని రూటో తీవ్రంగా ఆక్షేపించారు.

స్థానిక వనరులను విదేశాలకు తరలించడమే తప్ప.. కజిడో కౌంటీ అభివృద్ధికి కంపెనీ ఎలాంటి సహకారం అందించలేదని అధ్యక్షుడు మండిపడ్డారు. ముడి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేయడం మాని, కెన్యాలోనే గాజు, ఇతర పారిశ్రామిక రసాయనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత లీజును రద్దు చేసి.. సోడా యాష్‌ను స్థానికంగానే ప్రాసెస్ చేసే కొత్త పెట్టుబడిదారులకు మైనింగ్ హక్కులను అప్పగించాలని కెన్యా సర్కార్ నిర్ణయించింది. 

ఈ హఠాత్ పరిణామం వల్ల సుమారు 500 మంది ఉద్యోగులు, స్థానిక కాంట్రాక్టర్లు, కంపెనీపై ఆధారపడిన కుటుంబాల భవితవ్యం ప్రస్తుతం సందిగ్ధంలో పడ్డాయి. గత నెలలోనే నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో టాటా కెమికల్స్ మైనింగ్ కార్యకలాపాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తాము అన్ని నిబంధనలను పాటించామని కంపెనీ వాదించినప్పటికీ.. ప్రభుత్వ పట్టుదల కారణంగా ఇప్పుడు ఏకంగా వ్యాపారాన్ని వదులుకుని కెన్యాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ALSO READ : నూడుల్స్ వేస్టేజ్తో భుజియా తయారీ..

ప్రపంచవ్యాప్తంగా సహజ సోడా యాష్ ఉత్పత్తిలో కెన్యా 4వ స్థానంలో ఉంది. 2024లో కెన్యా సుమారు 2.64 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించగా.. అందులో అత్యధికభాగం భారత్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు ఎగుమతి అయింది. ఇప్పుడు కెన్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా.. మరీ ముఖ్యంగా టాటా గ్రూప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. స్థానిక విలువ పెంపు కోసం విదేశీ కంపెనీలపై కెన్యా ప్రభుత్వం తెస్తున్న ఈ ఒత్తిడి ఆటోమొబైల్, గ్లాస్ తయారీ రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.