దశాబ్దాల పాటు కష్టపడి తాను నిలబెట్టిన కోట్లాది రూపాయల వ్యాపారాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం పూర్తిగా వదిలేయాలని ఓ బిజినెస్‌మెన్ నిర్ణయం తీసుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ 'హావెల్స్' వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన సిరిపాంగ్ అక్కరాస్రియుక్ వ్యాపారాన్ని విక్రయించి సన్యాసిగా మారడానికి సిద్ధమౌతున్నారు. లౌకిక బంధాలను తెంచుకుని.. మెడిటేషన్, ఆధ్యాత్మిక సాధనలో మిగతా జీవితాన్ని గడపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ అసాధారణ నిర్ణయం వెనుక ఆయన సుదీర్ఘకాలిక ఆలోచన ఉంది. తాను పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించి 'అరహంత్' కావడమే తన ప్రధాన ధ్యేయమని సిరిపాంగ్ చెప్పారు. వచ్చే రెండేళ్లలో అటవీ ప్రాంతంలో ఏకాంత ధ్యానం కోసం స్థలాన్ని వెతికి, సన్యాస దీక్ష స్వీకరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రెండేళ్ల గడువులోగా తన వ్యాపార బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన తన 'హావెల్స్' ఐస్‌క్రీమ్ కంపెనీని రూ.47 కోట్లకు అమ్మకానికి పెట్టారు.
సన్యాస జీవితంపై ఆయనకు గత 15 ఏళ్లుగా స్పష్టమైన ప్లాన్ ఉందట. బుద్ధుని బోధనలపై ఆయన 'సక్సెస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది బుద్ధ' పేరుతో 2016లో ఒక పుస్తకాన్ని కూడా రచించారు. ఇక తాను అడవిలో ఏకాంతంగా గడిపే సమయంలో కేవలం తనకు ఆహారం అందించే ఒక్క శిష్యుడు తప్ప మరెవరితోనూ సంబంధం ఉండదని తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. లౌకిక ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో శేష జీవితాన్ని గడపడమే ఆయన తపన అంటున్నాడు ఈ థాయ్ వ్యాపారవేత్త.
1999లో ప్రారంభమైన 'హావెల్స్' ఐస్‌క్రీమ్ బ్రాండ్ ఒకప్పుడు థాయ్‌లాండ్‌లోని షాపింగ్ మాల్స్‌లో ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గత కొంతకాలంగా మాల్స్‌లో సరైన స్థలాలు దొరక్కపోవడం, వ్యాపార విస్తరణ కష్టమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారంతో పాటు ఆ బ్రాండ్ ట్రేడ్‌మార్క్, 2.77 ఎకరాల భూమి, ఆఫీస్ బిల్డింగ్, అత్యాధునిక యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీ.. 37 ఏళ్ల అనుభవంతో కూడిన హార్డ్ ఐస్‌క్రీమ్ రెసిపీలు కొనుగోలుదారులకు దక్కనున్నాయి.
ఈ వ్యాపారాన్ని సరైన కొనుగోలుదారునికి పరిచయం చేసే వారికి రూ. కోటి 43 లక్షల రిఫరల్ ఫీజుగా ఇస్తామని సిరిపాంగ్ ప్రకటించారు. కోట్లాది రూపాయల వ్యాపారాన్ని, హోదాను పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న ఈ థాయ్ వ్యాపారవేత్త స్టోరీ ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
