హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన బృందం.. ఆటో, క్యాబ్, యాప్ ఆధారిత రవాణా రంగంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
2012 తర్వాత ఆటో ఛార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల మంత్రికి యూనియన్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి అగ్రిగేటర్లపై నియంత్రణ ఉండాలని.. కనీస బేస్ ఛార్జీ, కిలోమీటర్ ఛార్జీలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అలాగే ప్రైవేట్ వాహనాల వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని, పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా హైర్ వెహికల్ ఛార్జీలను సవరించాలని కోరారు.
యూనియన్ ప్రతినిధులు చెప్పిన అంశాలన్నీ సానుకూలంగా విన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. అధికారులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తూ.. డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
