కన్నడ స్టార్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దునియా విజయ్. అంతే కాదు బాలకృష్ణ 'వీరసింహరెడ్డి' సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందారు. అయితే ఆయన రియల్ లైఫ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. దాదాపు పదమూడేళ్లుగా కొనసాగుతున్న వైవాహిక వివాదానికి కర్ణాటక హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. విజయ్, ఆయన భార్య నాగరత్నకు విడాకులు మంజూరు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
జీవితంలో ఊహించని ట్విస్ట్ ..
దునియా విజయ్, నాగరత్న 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నేళ్ల తర్వాత దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. 2013లో తొలిసారి విజయ్ విడాకులకు దరఖాస్తు చేయగా.. 2014లో ఇద్దరూ మళ్లీ కలిశారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు మళ్లీ మొదటికి వచ్చింది. 2018లో మరోసారి విడాకుల కోసం విజయ్ కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు ఫ్యామిలీ కోర్టు 2024లో ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
భరణం ఎన్నికోట్లంటే?
దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లేటెస్ట్ గా జస్టిస్ డీకే సింగ్, జస్టిస్ హెచ్.ఎస్. భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం వీరు తిరిగి కలిసే అవకాశాలు లేవు అని స్పష్టం చేస్తూ విడాకులు మంజూరు చేసింది. అంతే కాకుండా.. నాగరత్న పరిస్థితులు, ముగ్గురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ ఆమెకు రూ.2 కోట్ల ఒకేసారి భరణం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించకపోతే 6 శాతం వడ్డీ పడుతుందని హెచ్చరించింది.
పిల్లల కోసమే భరించా..
ఈ తీర్పు తర్వాత నాగరత్న చేసిన సోషల్ మీడియా పోస్ట్ కూడా చర్చనీయాంశమైంది. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్నాళ్లూ వివాహ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని ఆమె పేర్కొన్నారు. తాను తీవ్ర మానసిక, భావోద్వేగ వేదనను ఎదుర్కొన్నానని, 'నార్సిసిస్టిక్ అబ్యూజ్'ను అనుభవించానని ఆరోపించారు. వివాహేతర సంబంధం గురించి కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మిగతాది కాలానికి, కర్మకు వదిలేస్తున్నానని పేర్కొన్నారు. అయితే పిల్లలపై తన వ్యక్తిగత బాధ ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నానని తెలిపారు.
బాలయ్యకు విలన్ గా..
ఇక దునియా విజయ్ కెరీర్ విషయానికొస్తే.. 2007లో వచ్చిన 'దునియా' సినిమాతో ఆయనకు స్టార్ ఇమేజ్ వచ్చింది. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి'లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం తన కుమార్తె మోనిషా విజయ్‌కుమార్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ 'సిటీ లైట్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దునియా విజయ్ విడాకుల వ్యవహారం సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
